గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా విద్యారంగంపైనే తాను ఎక్కువ ఫోకస్ పెట్టానన్నారు ఏపీ సీఎం జగన్. టీచర్లను సైతం రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని జగన్ అన్నారు. ఎల్లో మీడియా కూడా రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తోందన్నారు. విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పేదలు మంచి చదువులు చదవాలనేదే సంస్కరణల లక్ష్యమన్నారు.అలెగ్జాండర్ ది గ్రేట్ ఉపాధ్యాయుల గురించి చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించారు సీఎం జగన్. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
విద్యా రంగ ప్రాధాన్యత గుర్తించే ఈ మూడేళ్లు అనేక చర్యలు తీసుకున్నాం. విద్యాశాఖలో చేసినన్ని సమీక్షలు ఇతర ఏ శాఖలోనూ చేయలేదు. విద్యార్థుల భవిష్యత్తు మార్చాలంటే విద్యాశాఖే కీలకం. మనం విద్యార్థులకు కేవలం పట్టాలే ఇస్తున్నామా? నిజమైన మార్పు తీసుకుని వస్తున్నామా అన్నది మనమే ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం విద్యను కార్పొరేట్ సెక్టార్‌కు అమ్మేసింది. గతంలో లాగా కార్పొరేట్ రంగంతో కుమ్మక్కు అయిన విధానం మాది కాదు. విద్యా వ్యవస్థను దేశంలోనే మెరుగ్గా తీర్చిదిద్దాలన్నది మా ప్రయత్నం అన్నారు జగన్. ప్రభుత్వ బడులకు మళ్ళీ వైభవం, గుర్తింపు తీసుకుని రావాలన్న తాపత్రయం మాది అన్నారు.
టీచర్లు తమ పిల్లలను కూడా ప్రభుత్వ స్కూళ్లల్లో చదివేలా తీసుకుని వస్తున్న మార్పులు గమనించాలి. ఎనిమిది తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తాం. విద్యా నైపుణ్యాల పెంపునకు బైజూస్‌తో ఒప్పందం కుదిరింది. విద్యారంగంలో మార్పులకు 53వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి. దీనిలో ఉపాధ్యాయుల సహకారం కీలకం అన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటళ్ళు, స్కూళ్లు, చివరకు ఆర్టీసీ కూడా వేస్ట్ అనే వైఖరిని అనుసరించింది. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్‌లను, స్కూల్ అసిస్టెంట్‌లను గ్రేడ్ టు హెడ్ మాస్టర్లుగా, హెడ్ మాష్టార్లను ఎమ్‌ఈఓలుగా ప్రమోషన్ కల్పిస్తున్నాం అన్నారు.
Bhagavantha Rao: సీఎం కు బతుకమ్మ ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ.. వినాయక ఉత్సవాలపై ఎందుకు లేదు?
రిటైర్మెంట్ తర్వాత మరింత ప్రయోజనం కలిగేలా చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం. పరోక్షంగా సీపీఎస్ అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి జగన్..ఏ ఒక్కరూ కూడా పట్టించుకోని ఉద్యోగుల పెన్షన్ విషయం మీద పూర్తి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాం అన్నారు. మంచి పరిష్కారం కోసం పని చేస్తున్నాం. గతంలో ఏనాడూ ఉద్యోగుల మీద సానుభూతి చూపని ప్రతిపక్షం.. ఉద్యోగులకు మంచి చేయాలని ఏనాడూ ప్రయత్నించలేదు. మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చ గొట్టేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ చేతుల మీదుగా పురస్కారం అందుకునే క్రమంలో కింద పడ్డాయి ఒక ఉపాధ్యాయుడి కళ్ళద్దాలు. అది గమనించిన ముఖ్యమంత్రి జగన్.. వెంటనే తానే కిందకు వంగి కళ్ళద్దాలు తీసి ఇచ్చారు. కళ్ళద్దాలను ఉపాధ్యాయుడి జేబులో పెట్టి తర్వాత పురస్కారం అందజేశారు ముఖ్యమంత్రి జగన్.
