వైయస్సార్ నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన నేతన్నలకు ఆర్థిక సహాయం కార్యక్రమం ప్రారంభించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దాదాపుగా 80 వేల మంది చేనేత కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది: రూ.192 కోట్లు జమచేస్తున్నాం. నేతన్నలు పడుతున్న ఇబ్బందులు, అవస్థలు నా పాదయాత్రలో స్వయంగా చూశాను. ప్రతి జిల్లాలో చేనేతల సమస్యలు నాకు చెప్పకున్నారు అని సీఎం అన్నారు. వారి గోడును బహుశా నేనెప్పటికీ మరిచిపోలేను. మగ్గంమీద బతుకుతున్న చేనేత కుటుంబానికి అక్షరాల రూ.24వేల ఆర్థిక సహాయాన్ని చేస్తున్నాం. 2 సంవత్సరాల 2 నెలల్లో వరుసగా మూడో విడత నేతన్న నేస్తం డబ్బులు విడుదల చేస్తున్నాం. ఈ సొమ్ముతో మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
ఇక కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు కన్నా… చేనేతలు బతకడానికి పడుతున్న ఇబ్బందులు ఎక్కువ అని భావించి.. ఈ 80వేల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇలా ఏటా దాదాపుగా రూ.200 కోట్లు చొప్పున 5 ఏళ్లకాలంలో రూ.1000 కోట్ల రూపాయలు కేవలం నేతన్న నేస్తం ద్వారానే ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయడంలేదు. మూడు దఫాలుగా నేతన్ననేస్తం ద్వారా దాదాపుగా రూ.72వేల రూపాయలు ఇచ్చాం. అనర్హులకు రాకూడదు, అర్హత ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. ఇప్పటికైనా గ్రామ సచివాలయాలకు వెళ్లి.. దరఖాస్తు చేసుకోవచ్చు. తనిఖీ పూర్తిచేసి.. తర్వాత వారికి వచ్చేట్టుగా చూస్తాం అని సీఎం జగన్ పేర్కొన్నారు.