CM Jagan: ఈనెల 6న మంగళవారం నాడు ఏపీ సీఎం జగన్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ మేరకు సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు ప్రకటించారు.
ఈనెల 6న ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం జగన్ బయలుదేరి ఉదయం 10:40 గంటలకు నెల్లూరు జిల్లా సంగం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:45 గంటలకు నెల్లూరు బ్యారేజ్ సైట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:50- 2:20 గంటల మధ్య నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
కాగా సంగం బ్యారేజీ నిర్మాణం ద్వారా పెన్నా నదికి వరద ముప్పును సమర్థవంతంగా ప్రభుత్వం నియంత్రించనుంది. బ్యారేజ్‌లో 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉండటం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగనున్నాయి. తద్వారా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యను ప్రభుత్వం పరిష్కరించనుంది. గతంలో పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి.
