Site icon NTV Telugu

CM Jagan: గ్రాసిమ్ పరిశ్రమతో రూ.2,700 కోట్ల పెట్టుబడులు.. 2,500 మందికి ఉద్యోగాలు

Cm Jagan

Cm Jagan

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రా‌సిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రాసిమ్‌ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయని వివరించారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1,300 మందికి, పరోక్షంగా 1,150 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా ఇప్పటికే రాష్ట్రంలో చట్టం చేసినట్లు ఆయన గుర్తుచేశారు.

రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి కంపెనీ ముందుకు రావడం శుభపరిణామం అని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. గ్రాసిమ్ పరిశ్రమ ఏర్పాటుపై బలభద్రపురం గ్రామస్తులు గతంలో ఆందోళన చెందారని.. కానీ ఈ పరిశ్రమలో టెక్నాలజీలో మార్పు ద్వారా జీరో లిక్విడ్‌ వేస్ట్‌ డిశ్చార్జ్‌ అవుతుందని జగన్ తెలిపారు. కలుషిత వ్యర్థాలు నేరుగా వదలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రాసిమ్‌ సంస్థకు ఈ ప్రాజెక్ట్‌ అప్పగించిందని.. అయితే సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేసిందని సీఎం జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా చేశామని జగన్ వెల్లడించారు. అవరోధాలను ఒక్కొక్కటిగా తొలగించి ప్రాజెక్టును నెలకొల్పామని తెలిపారు. కాగా గ్రాసిమ్ సంస్థ అందించే సీఎస్ఆర్ నిధులు స్థానికంగానే ఖర్చు చేస్తామని సీఎం జగన్ చెప్పారు.

Exit mobile version