Site icon NTV Telugu

CM Jagan: గ్రానైట్ పరిశ్రమలకు వరాలు.. కరెంట్ ఛార్జీలపై రూ.2 తగ్గింపు

Cm Jagan

Cm Jagan

CM Jagan: ప్రకాశం జిల్లా పర్యటనలో గ్రానైట్ పరిశ్రమలపై సీఎం జగన్ వరాలు కురిపించారు. గ్రానైట్ పరిశ్రమల విషయంలో మహానేత వైఎస్ఆర్ హయాంలో మాదిరిగానే స్లాబ్ విధానాన్ని మళ్లీ తాము తీసుకువస్తున్నామని.. ఈరోజే జీవో నంబర్ 58 విడుదల చేశామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువ గ్రానైట్ పరిశ్రమలు ఉండటంతో సింగిల్ బ్లేడ్‌కు రూ.27వేలు, మల్లీ బ్లేడ్‌కు నెలకు రూ.54వేలు ఇచ్చేలా స్లాబ్ సిస్టమ్ తీసుకువస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గ్రానైట్ పరిశ్రమల నడ్డి విరిచేలా గత ప్రభుత్వంలో చంద్రబాబు విధానాలు ఉన్నాయని సీఎం జగన్ ఆరోపించారు. గ్రానైట్ పరిశ్రమలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నామని.. ప్రభుత్వానికి ఏడాదికి రూ.135 కోట్ల నష్టం వస్తున్నా పరిశ్రమల మంచి కోసం ముందుకు వెళ్తున్నామని తెలిపారు. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు సంబంధించి చంద్రబాబు హయాం నుంచి ఉన్న కరెంట్ ఛార్జీలను యూనిట్‌కు రూ.2 తగ్గిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చినా లక్షల్లో ఉన్న కార్మికుల మంచి కోసం ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ పేర్కొన్నారు.

మరోవైపు ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమైనదని సీఎం జగన్ అభివర్ణించారు. వెలిగొండ ప్రాజెక్టు ఒకటి, రెండు టన్నెల్ పనులు వైఎస్ హయాంలో పరుగులు పెట్టాయని.. చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు పనులు తూతూ మంత్రంగా చేశారని సీఎం జగన్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి టన్నెల్ పూర్తి చేశామని.. రెండో టన్నెల్ 2023 సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని జగన్ ప్రకటించారు. వెలిగొండ ప్రాజెక్టుతో జిల్లా రూపు రేఖలు మారతాయని.. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ వెంకాయమ్మ కోరిక ప్రకారం.. కొత్త జెడ్పీ కార్యాలయం కోసం రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తాళ్లూరు మండలం శివరామపురంలోని మొగిలిగుండాల ప్రాజెక్టుకు బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల ప్రాజెక్టుగా నామకరణం చేస్తున్నామని జగన్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను ఇప్పటికే నెరవేర్చామని.. చీమకుర్తిలో వైఎస్ఆర్, బూచేపల్లి సుబ్బారెడ్డి లాంటి ఇద్దరు మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని జగన్ అన్నారు. గాంధీ, అంబేద్కర్‌, పూలే, అల్లూరి, ప్రకాశం, మహానేత వైఎస్ఆర్.. ఇలా మహనీయులను కలకాలం ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. ఎందుకంటే వీళ్లకు భౌతికంగా మరణం ఉన్నా.. వీళ్లు చేసిన మంచికి, భావాలకు మరణం ఉండదు అనేది వాస్తవమని సీఎం జగన్‌ తెలిపారు. అటు వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తామని జగన్ ప్రకటించారు.

Exit mobile version