Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. మంత్రులకు ఇదే చివరి సమావేశం

Ap Cabinet

Ap Cabinet

అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం మధ్యాహ్నం సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో 36 అంశాలపై చర్చించనున్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, మిల్లెట్ మిషన్ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. కొత్త రెవెన్యూ డివిజన్లలో మార్పులు, 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుపై కూడా మంత్రివర్గ చివరి భేటీలో చర్చించనున్నారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై కూడా చర్చించనున్నారు.

అయితే ఈ సమావేశం మంత్రులందరికీ చివరిది కానుంది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నారు. అనంతరం వారి రాజీనామా పత్రాలను జీఏడీ అధికారులు గవర్నర్ దగ్గరకు తీసుకువెళ్లనున్నారు. చివరి కేబినెట్ సమావేశం కావడంతో మంత్రులతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఎవరెవర్నీ తీసేస్తున్నారు.. ఎందుకు తీస్తున్నారో వివరించి చెప్పనున్నారు. చాలా మంది మంత్రులకు మంత్రిగా ఇదే చివరి రోజు కావడంతో ఆయా ఛాంబర్లలో సందడి వాతావరణం కనిపించింది. చివరి నిమిషంలో పెండింగ్‌ ఫైళ్లపై మంత్రులు చకాచకా సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. మంత్రులను కలిసేందుకు అధికారులు, సన్నిహితులు రావడంతో అక్కడ పండగ వాతావరణం కనిపించింది. అయితే సామాజిక సమీకరణాలు, జిల్లాల పరంగా కొత్తగా మంత్రి పదవి చేపట్టే వాళ్లు ఎవరో అనే ఉత్కంఠ మాత్రం రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.

https://ntvtelugu.com/delivery-between-cell-phone-lights-in-narsipatnam-government-hospital/

 

Exit mobile version