Site icon NTV Telugu

CM Jagan: కోర్టు కేసుల వల్లే ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యం

Ap Cm Jagan

Ap Cm Jagan

అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో 1.23 లక్షల ఇళ్లపట్టాల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30.70 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. మరోవైపు 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమైందని వెల్లడించారు. గజం 12 వేలికే చోట రూ.6 లక్షలు విలువైన ఇళ్లస్థలాన్ని పేదలకు ఇచ్చామని తెలిపారు. ఇంటి నిర్మాణం, మౌలిక సదుపాయాలతో కలిపి రూ.10 లక్షల వరకు ఆస్తిని ప్రతి అక్కాచెల్లెమ్మ చేతిలో పెట్టామని సీఎం జగన్ వివరించారు.

16 నెలల కిందటే ఇక్కడ ఇళ్లపట్టాలు ఇవ్వాలని అనుకున్నామని.. అయితే జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని కొందరు కడుపు మంట ఎక్కువైపోయి కోర్టులో కేసులు వేశారని జగన్ ఆరోపించారు. ఈ కేసులు ఎలా తొలుగుతాయోనని ప్రతిరోజు తాను ఆలోచించేవాడినని తెలిపారు. ఇన్ని లక్షలమందికి మేలు చేస్తున్న కార్యక్రమాలను కొంతమంది అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కోర్టు కేసుల వల్ల 489 రోజులు ఇక్కడ ఇళ్లపట్టాలు ఇవ్వడం ఆలస్యమైందని వివరించారు. అయితే దేవుడి దయ వల్ల కోర్టుల్లో కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. పిల్లలకు ఇంటి రూపంలో ఒక ఆస్తిని ఇవ్వాలనుకుంటారని.. ఒక ఇల్లు ఉండడం అనేది అక్కచెల్లెమ్మకు సామాజిక హోదా ఇచ్చినట్టు అవుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీలో 17వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయని.. ఇళ్లు లేని వాళ్లు ఎవరైనా సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే, స్థలం ఇస్తామని జగన్ ప్రకటించారు.

Exit mobile version