Site icon NTV Telugu

CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..

Cm Chandrababu Naidu

Cm Chandrababu Naidu

కుట్రలు, కుతంత్రాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాల్సిన సమయంలో, పిఠాపురంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదంపై తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో నేతల మధ్య సమన్వయం దెబ్బతింటే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు సీరియస్ వార్నింగ్..

పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో జరిగిన గొడవలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో.. ఆయన స్పందించారు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడిన చంద్రబాబు, పార్టీ అంతర్గత క్రమశిక్షణపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

కూటమి ప్రభుత్వంలో నేతలంతా ఒకే తాటిపై ఉండాలని, చిన్న చిన్న ప్రోటోకాల్ విషయాల కోసం వీధి గొడవలకు దిగడం పార్టీ గౌరవాన్ని తగ్గిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. సీనియర్ నేతగా ఉన్న వర్మ ఇలాంటి వివాదాలకు కారణం కావడం సరికాదని, ఏదైనా పొరపాటు జరిగితే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప, ఘర్షణలకు దిగడం తగదని చంద్రబాబు క్లాస్ పీకారు. అగ్ర నాయకులు ఇలా ప్రవర్తిస్తే క్షేత్రస్థాయిలోని కార్యకర్తలకు తప్పుడు సందేశం వెళ్తుందని, ఇది భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర అధ్యక్షుడికి ఆదేశాలు..

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పల్లా శ్రీనివాస్‌కు సీఎం సూచించారు. వివాదాలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలి తప్ప, మీడియాలో గానీ, బహిరంగంగా గానీ పార్టీ పరువు తీయవద్దని స్పష్టం చేశారు. పిఠాపురం లాంటి కీలక నియోజకవర్గంలో నేతలు సంయమనం పాటించాలని ఆయన ఆదేశించారు. ఈ పరిణామం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version