Site icon NTV Telugu

CM Chandrababu: కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సంతాపం..

Cbn

Cbn

CM Chandrababu: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారు జామున తుదిశ్యాస విడిచారు. కోట శ్రీనివాసరావు మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు మరణం విచారకరం అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం రాసుకొచ్చారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయం అన్నారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కోట పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి.. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు.. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజాసేవ చేశారు.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని చంద్రబాబు ఆ పోస్టులో పేర్కొన్నారు.

Read Also: Kota SrinivasRao : కోట శ్రీనివాసరావుకు సినీ, రాజకీయ ప్రముఖుల ఘన నివాళి

ఇక, ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు.. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు.. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది.. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు.. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని నారా లోకేష్ వెల్లడించారు.

Exit mobile version