NTV Telugu Site icon

CM Chandrababu : మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ఇక చిరునామాగా ఉంటుంది.

Chandrababu

Chandrababu

గుంటూరు జిల్లా కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేషస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసం అనేది ఉండదని, మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ఇక చిరునామాగా ఉంటుందన్నారు. మంచి చేసే వారంతా ఆంధ్రప్రదేశ్ లో ఇక ముందుకు రావాలన్నారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామన్నారు సీఎం చంద్రబాబు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభించిన స్ఫూర్తితోనే నాడు 203 అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టామని, ఆధ్యాత్మిక సేవా కేంద్రాలు లేకపోతే ఇప్పుడుండే జైళ్లు, ఆసుపత్రులు కూడా చాలనంతగా నేరాలు పెరిగిపోతాయన్నారు సీఎం చంద్రబాబు. దైవసేవతో పాటు మానవ సేవనూ హరేకృష్ణ సంస్థ సమానంగా చేస్తోందని, ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మికత పెంపొందించేందుకు ఇస్కాన్, హరేకృష్ణ సంస్థలు పోటీ పడుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఆధ్యాత్మిక ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమన్నారు.

అంతేకాకుండా..’40ఏళ్ల క్రితమే ఐఐటీ చదివినా నమ్మిన సిద్ధాంతం కోసం దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా మధుపండిత్ దాస్ కృషి చేస్తున్నారు. 50 మంది ఐఐటీ పట్టభద్రులు జీవితాలను త్యాగాలు చేసి సేవా కార్యక్రమంలో పాల్గొంటుండటం అభినందనీయం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవనూ కొనసాగించాలి. వెంకటేశ్వరస్వామి దయతోనే అలిపిరి బాంబు పేలుళ్ల నుంచి బయట పడ్డాను. ప్రజలకు సేవలందించే అవకాశం కోసమే నాకు తిరిగి ప్రాణ భిక్షపెట్టారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలి. అక్షయపాత్ర ద్వారా ప్రతీ రోజు 22 లక్షల మందికి భోజనం పెడుతున్నారు. అన్న క్యాంటీన్లను చిన్న ఫిర్యాదు లేకుండా బ్రహ్మాండంగా అక్షయపాత్ర నిర్వహించింది. పెనుగండలో 108 అడుగుల లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం ఏర్పాటుకు కూడా హరేకృష్ణ సంస్థ ముందుకొచ్చింది.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.