Site icon NTV Telugu

CJI NV Ramana: సీజేఐ హ్యాపీడేస్.. ఏఎన్‌యూలో చదివిన రోజులను గుర్తుచేసుకున్న ఎన్వీ రమణ

Nagarjuna University Cji Nv Ramana

Nagarjuna University Cji Nv Ramana

CJI NV Ramana: గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీలో స్నాతకోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా డాక్టరేట్, మాస్టర్ డిగ్రీలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన వారికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో వీసీ పట్టాలు అందించారు. అటు సీజేఐ ఎన్వీ రమణకు నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. గౌరవ డాక్టరేట్ పట్టాను జస్టిస్ ఎన్వీ రమణకు యూనివర్శిటీ ఛాన్సిలర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అందజేశారు. అనంతరం సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తాను చదివిన యూనివర్సిటీ నుంచే గౌరవ డాక్టరేట్ పొందడం సంతోషంగా ఉందన్నారు. ఆచార్య నాగార్జున సిద్దాంతాల స్ఫూర్తితో యూనివర్సిటీని స్థాపించారని.. గత నాలుగు దశాబ్దాలుగా నాగార్జున యూనివర్సిటీ విద్యా రంగానికి ఎన్నో సేవలు అందించిందని తెలిపారు.

దేశంలో అన్ని రకాల అసమానతలు తొలగాలంటే విద్యా రంగమే కీలకమని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఎంతో మేథో మధనం తర్వాత 2009లో విద్యా హక్కు చట్టం వచ్చిందని.. హ్యుమానిటీ, చరిత్ర వంటి సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. హోలిస్టిక్ విద్యా విధానం ఉన్నప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్ అసోసియేషన్ కారణంగానే తాను ఇక్కడ చేరానని పేర్కొన్నారు. అసోసియేషన్ నేతలు వచ్చి పట్టు పట్టడంతో లా స్టూడెంట్‌గా చేరానని తెలిపారు. అటు యూనివర్సిటీతో తన హ్యాపీడేస్ రోజులను కూడా సీజేఐ ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు. నాగార్జున యూనివర్సిటీలో తమ అడ్డా క్యాంటీనేనని.. క్యాంటీన్‌లో కూర్చొని అనేక విషయాలపై చర్చించే వాళ్లమన్నారు. లా కాలేజీ వల్ల మిగిలిన విద్యార్ధులు చెడిపోతున్నారనే ఆరోపణలతో తమ కాలేజీని తరలించాలనే ప్రతిపాదన జరిగిందన్నారు.

నాడు వివిధ అంశాలపై యువతలో జరిగిన చర్చ ఇప్పుడు జరగడం లేదని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. సమస్యలపై యువత స్పందించకపోవడం సమాజానికి మంచిది కాదన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా విద్యా విధానం ఉండాలన్నారు. యూనివర్సిటీలు రీసెర్చ్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు. రీసెర్చ్ వింగ్ కోసం యూనివర్సిటీలు కూడా అవసరమైన మేరకు బడ్జెట్ కేటాయింపులు జరపాలని హితవు పలికారు. సమాజం కోసం.. సమాజ అవసరాల కోసం పౌరులను తయారు చేసేలా విద్యా విధానం ఉండాలని..యూనివర్సిటీకి అవసరమైన నిధులిచ్చేలా మంత్రి బొత్స చొరవ తీసుకుంటారన్నారు. మంత్రి బొత్స దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారని సీజేఐ చెప్పారు.

మరోవైపు మంత్రి బొత్స మాట్లాడుతూ..సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ పట్టా ఇవ్వడం అద్భుతమైన ఘట్టమన్నారు. నాగార్జున యూనివర్సిటీలో చదివి.. అదే యూనివర్శిటీలో గౌరవ డాక్టరేట్ పొందడం ఇదే తొలిసారి అన్నారు విద్యే సంపద అని రాష్ట్ర ప్రభుత్వం నమ్మకమని నూతన విద్యా విధానం అమలు చేస్తోందని మంత్రి బొత్స వివరించారు. విద్యా శాఖలో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మెరుగైన విద్యను అందించడమే జగన్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. గౌరవ డాక్టరేట్ తీసుకోవడం జస్టిస్ ఎన్వీ రమణకు గర్వ కారణం కాదని.. యావత్ రాష్ట్ర ప్రజానీకానికే గర్వ కారణమని పేర్కొన్నారు.

 

Exit mobile version