Site icon NTV Telugu

సోదాల విషయంలో తగ్గేది లేదంటున్న ప్రభుత్వం…

సినిమా థియేటర్లలో సోదాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే నిబంధనల విషయంలో రాజీపడేది లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు . నిబంధనలకు విరుద్ధంగా థియేటర్లు నిడిపితే చూస్తూ ఊరుకోవాలా అని కౌంటర్‌ ప్రశ్న వేస్తున్నాయి. ఈ ఊపు చూస్తుంటే మరిన్ని థియేటర్లు మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది.

సినిమా పరిశ్రమ వర్సెస్‌ ఏపీ సర్కార్‌ రగడకు తాజా ఎపిసోడ్‌ మరింత ఆజ్యం పోసినట్లు కనిపిస్తోంది. ఒక వైపు సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటంతో ఇప్పటికే సినీ రంగానికి చెందిన కొంత మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సినీ హీరో నాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.కొన్ని థియేటర్‌ యాజమాన్యాలు రేట్లు పెంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలంటూ ఇప్పటికే కోర్టు గుమ్మం తొక్కాయి. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తు ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సినిమా థియేటర్ల పై ఎక్కడికక్కడ అధికారులు దాడులు చేస్తుండటం, ఫైన్లు విధించటం మరింత ఆజ్యం పోసినట్లు అవుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 వరకు సినీ థియేటర్లను అధికారులు మూసి వేశారు. ఈ విషయంలో తగ్గేదే లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు . ఫైర్‌ సేఫ్టీ లేదా ఇతర నిబంధనలను పాటించకుండా థియేటర్లు నిర్వహిస్తుంటే చర్యలు తీసుకోవటం తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నాయి.

రాష్ట్రంలో చిన్న గ్రామ పంచాయతీల్లో నాన్‌ ఏసీ థియేటర్లు లేనప్పుడు పది రూపాయలు, పది హేను రూపాయలకో టికెట్లు అమ్మే పరిస్థితి ఎక్కడ ఉంటుందన్నది ప్రభుత్వ వర్గాల వాదన. మొత్తం మీద థియేటర్ల ప్రక్షాళన పూర్తయ్యే వరకు ప్రభుత్వం ఊరుకునేలా కనిపించడం లేదు.

Exit mobile version