NTV Telugu Site icon

జారుతున్న మట్టి.. ఊపిరి బిగపట్టి.. రాయలచెరువు తాజా స్థితి!

తిరుపతి నగరంలో భారీవర్షాల తర్వాత నిండుకుండలా మారిన రాయలచెరువు స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రాయల చెరువు సమీప గ్రామాల ప్రజలు ఇంకా భయం గుప్పెట్లోనే వున్నారు. అక్కడ క్షణక్షణం ఉత్కంఠ. రాయల చెరువు ప్రాంతంలో జారుతున్న మట్టితో జనం ఊపిరి బిగపట్టి మరీ జీవితం వెళ్ళదీస్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కంటిమీద కునుకు లేకుండా వుంది జిల్లా యంత్రాంగం.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. రాయలచెరువు కట్టపైనే ఎమ్మెల్యే చెవిరెడ్డి, కలెక్టర్, ఎస్పీ పహారా కాస్తున్నారు. రాయలచెరువుకి ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టగా అవుట్ ఫ్లో పెరిగింది. వర్షం పడటంతో మరింత ఆందోళనలో వున్నారు స్దానికులు. తట్టాబుట్టా, గొడ్డుగోధతో గ్రామాలకు, గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. చెరువు కింద 100 కి పైగా గ్రామాలున్న సంగతి తెలిసిందే.

రాయలచెరువు ప్రాంతంలోనే మకాం వేశారు ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు. రంగంలోకి మూడు హెలికాప్టర్లు దించారు. పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో స్థానికులతో పాటు అధికారులు కూడా టెన్షన్ పడుతున్నారు.