Kanipakam Vinayaka Brahmotsavam 2026: చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలకు, వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఆలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. స్వామివారి దర్శనం కోసం సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భక్తుల కోసం లక్ష లడ్డూలు.. ఐదు వేల వడలు సిద్ధం
భారీగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ప్రసాదాల ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష లడ్డూలు, ఐదు వేల వడలను సిద్ధం చేశారు. ఆలయం వెనుక వైపు ప్రసాదాల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు సులభంగా ప్రసాదాలను పొందేలా ఏర్పాట్లు చేశారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరసిద్ధి వినాయకస్వామివారికి పట్టు వస్త్రాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమర్పించనున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.
మంగళవారం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 24 నుంచి ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. మొత్తం 21 రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తుల రద్దీని నియంత్రిస్తూ అందరికీ స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
రోజూ వేలాది మందికి అన్నప్రసాదం
కాణిపాకానికి వచ్చే భక్తుల కోసం ప్రతిరోజూ భారీగా అన్నప్రసాదాన్ని అందించనున్నారు. రోజుకు సుమారు ఐదు వేల నుంచి ఏడు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాన్ని కూడా పొడిగించనున్నారు. అవసరమైతే రాత్రి 10 గంటల వరకు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.

