Site icon NTV Telugu

CM Chandrababu: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Babu

Babu

CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో పర్యటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం గ్రామాల్లో వాతావరణం పూర్తిగా మారిందని, ప్రజలు ఉత్సాహంగా స్వగ్రామాలకు వచ్చి పండుగలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు గ్రామాలకు వెళ్లాలంటే భయం ఉండేదని, కానీ ఈ ఏడాది భోగి–సంక్రాంతి పండుగలను ప్రజలు ఎంతో ఆనందంగా తమ ఊళ్లలో జరుపుకున్నారని సీఎం చెప్పారు. జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదని, గ్రామాలతో ఉన్న అనుబంధమే మన సంస్కృతి అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల చదువుకుని ఉన్నత స్థితికి చేరుకున్నవారు చాలామంది ఉన్నారని, అయితే అదే సమయంలో జీవన ప్రమాణాల్లో అసమానతలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటికీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని తెలిపారు. భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైనా, బిలియనీర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అసమానతలు కూడా పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

Read Also: Indian Army Day 2026: సెల్యూట్ జవాన్! భారత సైనికులు మైనస్ 50 డిగ్రీల వద్ద ఎలా గస్తీ కాస్తారో తెలుసా?

అసమానతలు తగ్గకపోతే సమాజంలో సంతృప్తి ఉండదని, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించినప్పుడే నిజమైన సమసమాజం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. అందుకే పీ4 కార్యక్రమం ద్వారా 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుని పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2026 నుంచి ఈ కార్యక్రమంపై మరింత దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. కేవలం డబ్బు మాత్రమే కాకుండా, మేనేజ్‌మెంట్ స్కిల్స్ కూడా అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు స్వగ్రామంలోనే ఉండి స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని, భోగి, సంక్రాంతి వేడుకలను ప్రజలతో కలిసి జరుపుకున్నామని చెప్పారు. సంక్రాంతి రైతుల పండుగ అని, పంటలు ఇంటికి వచ్చినప్పుడు రైతు కుటుంబాలు ఆనందంగా గడుపుతాయని పేర్కొన్నారు. రైతులకు రూ.10 వేల కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించి వారి ముఖాల్లో ఆనందం తీసుకొచ్చామని తెలిపారు.

సంక్రాంతి రోజున పెద్దలను తలచుకుని నివాళులు అర్పించడం మన సంప్రదాయమని, పెద్దలను గుర్తు పెట్టుకోకపోతే వారసత్వమే ఉండదని చంద్రబాబు అన్నారు. కనుమ పండుగ సందర్భంగా ప్రకృతిని, పశువులను పూజించుకోవడం మన సంస్కృతికి నిదర్శనమని చెప్పారు. 2047 వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 2029, 2039 నాటికి ఏం సాధించాలన్న దానిపై స్పష్టమైన టార్గెట్లతో ముందుకెళ్తున్నామని చెప్పారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం పెరగాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నామని అన్నారు. స్వర్ణ నారావారిపల్లె కార్యక్రమానికి గతేడాదే శ్రీకారం చుట్టామని, ఇక్కడ జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామపురం పంచాయతీలను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారిని నియమించి మరుగుదొడ్లు, దీపం, పింఛన్లు వంటి పథకాలు అమలు చేస్తున్నామని, ఇల్లు లేని వారిని గుర్తించామని చెప్పారు. ఇంటి స్థలం ఉన్నా సొంత ఇల్లు లేని వారికి ఏడాది లోపే ఇళ్లు నిర్మిస్తామని, ఇంటింటికీ తాగునీటి సరఫరా కూడా అందించేలా చర్యలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Exit mobile version