MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Mla Gurajala Jaganmohan

Mla Gurajala Jaganmohan

MLA Gurajala Jaganmohan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ సాగుతోన్న వేళ.. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలంటూ ఎమ్మెల్యే పేరుతో పోస్టర్ విడుదల కావడం చర్చకు దారితీస్తోంది.. పార్టీ నాయకులు, సామాజిక సేవకులు, యువత, మహిళలకు అవకాశం కల్పిస్తామంటూ పోస్టర్‌లో పిలుపునిచ్చారు.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.. ఎమ్మెల్యే ఇంటి వద్ద దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు..

అయితే, కార్పొరేషన్ ఎన్నికలకు ముందే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.. ఈ ప్రకటన వెనుక ఎమ్మెల్యే వ్యూహమేంటి పక్కన పెడితే‌… ఎన్నో ఏళ్లుగా జెండా పట్టి పార్టీ కోసం కష్టపడిన మాకు ఇలాంటి పరిస్థితి ఏంటి అని తమ్ముళ్లు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారట.. పార్టీ నాయకులతో పాటు సామాజిక సేవకులు, యువత, మహిళలకు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని పోస్టర్‌లో పేర్కొనడం.. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం.. ఇందుకోసం ఎమ్మెల్యే ఇంటి వద్ద దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించడంతో.. స్థానిక నేతలను టెన్షన్‌ పెడుతుందట.. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక, దరఖాస్తుల స్వీకరణ వెనుక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వ్యూహం ఏమిటన్నది ప్రస్తుతం చిత్తూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా.. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.