Site icon NTV Telugu

Chandra Babu: దళిత యువకుడు నారాయణ మృతిపై న్యాయవిచారణ జరిపించాలి

Chandrababu

Chandrababu

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దళిత యువకుడు నారాయణ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. సీఎస్‌కు రాసిన లేఖ కాపీని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి కూడా చంద్రబాబు పంపారు. పోలీసుల దెబ్బల కారణంగానే దళిత యువకుడు నారాయణ చనిపోయాడని.. రాజకీయ ప్రత్యర్థులు, దళితులు, మైనార్టీలు, మహిళలు, బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని పోలీసుల దౌర్జన్యాలు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. నారాయణ మరణం ఏపీలోని ఒక వర్గం పోలీసుల క్రూరమైన పని తీరుకు నిదర్శనమన్నారు. అధికార పార్టీకి చెందిన వారి ప్రోద్భలంతో పోలీసులు విచారణ పేరుతో నారాయణను జూన్ 17న కస్టడీకి తీసుకుని చిత్ర హింసలకు గురి చేశారని చంద్రబాబు ఆరోపించారు. జూన్ 19న నారాయణ అనుమానాస్పద స్థితిలో తన గ్రామ శివార్లలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడని.. తనను కస్టడీలో తీవ్రంగా హింసించారని నారాయణ తన కుటుంబ సభ్యులకు ముందుగానే తెలిపాడని సీఎస్‌కు రాసిన లేఖలో చంద్రబాబు వివరించారు.

Read Also: CM Jagan: ఏపీలో వరద ప్రభావిత జిల్లాలకు సీనియర్ అధికారుల నియామకం

నారాయణ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోందని చంద్రబాబు లేఖలో అభిప్రాయపడ్డారు. విచారణ పేరుతో నారాయణను అదుపులోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి అతడి మరణానికి కారణమయ్యారని చంద్రబాబు విమర్శించారు. పోస్ట్ మార్టం అనంతరం నారాయణ మృతదేహాన్ని కుటుంబ ఆచారాలకు అనుగుణంగా ఖననం చేయాల్సిన ఉండగా దహనం చేశారని.. నారాయణ మృతి కేసులో తదుపరి విచారణ వద్దని ఆయన కుటుంబ సభ్యులను పోలీసు అధికారులు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ ఘటనలో పొదలకూరు పోలీస్ స్టేషన్ సబ్ఇన్‌స్పెక్టర్ పాత్రపై సమగ్ర విచారణ జరపడం చాలా ముఖ్యమన్నారు. నారాయణ పోస్ట్‌మార్టం నివేదికను బహిరంగపరచాలని.. నారాయణ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. మొత్తం ఘటనపై జ్యుడిషియల్ విచారణ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సమీర్ శర్మను చంద్రబాబు కోరారు.

Exit mobile version