వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి గ్యాంగ్ కొండల్ని తవ్వేసి చెరువులుగా చేసేస్తున్నారు. చెట్లని కొట్టేస్తే పెంచొచ్చు.. కొండల్ని తవ్వేస్తే ఎలా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. విశాఖలోని రుషికొండను ఇష్టం వచ్చినట్లు తవ్వేశారని.. విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండను ధ్వంసం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. రుషికొండను తవ్వొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని.. కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారికి కూడా అంతుబట్టని విధంగా రవ్వల కొండను తవ్వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రవ్వల కొండలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని.. అలాంటి కొండను తవ్వేసి సెంటిమెంటును దెబ్బ తీశారన్నారు.
Read Also: Tirumala: తిరుమలలో యూపీఐ ద్వారా చెల్లింపులు షురూ
వైసీపీ అధికారంలోకి వచ్చాక కాకినాడలో మడ అడవులు కొట్టేశారని.. తుఫాన్‌ల నుంచి రక్షణగా నిలిచేందుకు మడ అడవులు ఉపయోగపడతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రకృతి నాశనం అయ్యేలా వ్యవహరిస్తోన్న అంశంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీ సిమెంట్స్ కోసం బమిడికలొద్దిలో లాటరైట్, బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారన్నారు. కుప్పంలో కూడా ఇదే తరహాలో తవ్వేస్తున్నారన్నారు.కుప్పంలో అక్రమంగా జరిగే మైనింగ్ ప్రాంతం వద్దకు తాను వెళ్లినా రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వైసీపీకి ఖండకావరం పెరిగిందని.. కొండల్ని అక్రమంగా తవ్వేస్తున్న వారందర్ని బోనెక్కిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకెళ్లిందని.. 60 మందికి పైగా ప్రాణాలు పోయాయన్నారు. ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడిన తరహాలో వ్యవహరిస్తోందన్నారు. టీడీపీ హయాంలో ఏపీలో గ్రీనరీ కవర్ పెంచామని.. చెట్ల వల్లే క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుందన్నారు. తొలుత కొండలకు గుండు కొట్టారని.. ఆ తర్వాత చెరువులను తవ్వేశారని చంద్రబాబు చురకలు అంటించారు.
కొండల్ని చెరువులుగా మారుస్తున్న జగన్ రెడ్డి గ్యాంగ్ – టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం, ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. https://t.co/CfBRFyaIAn
— Telugu Desam Party (@JaiTDP) July 13, 2022