గత వారం రోజులుగా సూర్యుడి దర్శనం లేకుండా పోయింది. ఎక్కడ చూసినా వానే.. వరదే. వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఉందనే నమ్మకాన్ని కల్పించాలన్నారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. భారీవర్షాల కారణంగా గోదావరికి వరదలొచ్చి 6 జిల్లాల్లోని 42 మండలాల పరిధిలో 525 పైగా గ్రామాల ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. పోలవరం ముంపు గ్రామాలతో పాటు.. లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదమరచి నిద్రపోతోంది.
ముఖ్యంగా ఇటువంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే చిన్న సూచన కూడా వారికి ధైర్యాన్ని ఇస్తుంది. తగిన సమయంలో అప్రమత్తం చేయడం వల్ల ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలం.రాష్ట్రంలో పిడుగులు ఎప్పుడు, ఎక్కడ పడతాయో ముందుగా తెలియజేసే సాంకేతిక వ్యవస్థను గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చింది.వరదలపై ఆయా గ్రామాల ప్రజల మొబైల్ ఫోన్లకు రియల్ టైంలో వరద సమాచారం పంపి…వారిని అప్రమత్తం చేసేలా టెక్నాలజీని పాలనతో మిళితం చేసింది. ప్రకృతి విపత్తులలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరింపజేసి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తక్షణ సాయం అందించే వాళ్లం.
అయితే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.ఆనాటి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు. యంత్రాంగాన్ని నడిపించాల్సిన పాలకుల అలసత్వంతో ప్రజలు అల్లాడుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వరద బాధితులకు అండగా నిలిచి సాధ్యమైనంత సాయం చెయ్యాలి.ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల డిమాండ్లపై రాజకీయ విమర్శలతో కాలయాపన చెయ్యకుండా ప్రజలను ఆదుకునే చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కోరుతున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనే నమ్మకాన్ని ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ట్వీట్ చేశారు చంద్రబాబు.
