లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ్టి (బుధవారం) నుంచి ఐదు రోజుల పాటు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నేడు అమలాపురం, రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ పరిధిలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక, రావులపాలెం, రామచంద్రపురంలో టీడీపీ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ బహిరంగ సభలకు భారీ ఎత్తున ప్రజలను పార్టీ నేతలు సమీకరిస్తున్నారు.
Read Also: Kurnool: కర్నూలులో పోలీసుల దాష్టీకం.. కార్పొరేటర్ దుస్తులు విప్పి, లాఠీలతో కొట్టి..!
అలాగే, రేపు కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు రోడ్‌షోలో పాల్గొంటారు. ఇక, ఏప్రిల్ 5వ తేదీన నరసాపురం, పాలకొల్లు, 6న పెదకూరపాడు, సత్తెనపల్లి, 7న పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే, ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం నిర్వహించిన తర్వాత సాయంత్రం 6 గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు. తొలి విడతలో 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షోల్లో నిర్వహించిన చంద్రబాబు రెండో విడత యాత్రను నేటి నుంచి కొనసాగించనున్నారు.