NTV Telugu Site icon

Chandrababu Naidu: జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత

టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో టీడీపీ అధినేత చంద్రబాబు చిట్ చాట్ చేశారు. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఈ స్థాయి ప్రజా వ్యతిరేకత లేదు చరిత్రలో చూడలేదు. ప్రభుత్వాలు విఫలం అవ్వడం వేరు.. పాలనపై ఈ స్థాయి అసంతృప్తి వేరు. టీడీపీ అత్యధిక సీట్లు గెలుచుకున్న 1994లో కూడా అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత లేదన్నారు చంద్రబాబు.

జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి. జగన్ పథకాలు వెనుక ఉన్న లూటీ ప్రజలు గుర్తించారు. తాము ఏం నష్టపోయామో ప్రజలకు తెలుస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సంక్షేమ పథకాలు కారణం కాదు.. జగన్ లూటీ వల్లనే ఈ దుస్థితి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను దెబ్బతీసి జగన్ తన ఆదాయం పెంచుకుంటున్నాడు.

మద్యం పై బహిరంగ దోపిడీ జరుగుతుంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వ్యక్తుల జేబులోకి వెళుతుంది. మైనింగ్, ఇసుకను సంపూర్ణంగా దోచుకుంటున్నారు.. ఈ భారం ప్రజపైనే పడుతుంది. రైతు వర్గంలో ఒక్క ఓటు కూడా ఇక వైసీపీకి పడే ఛాన్స్ లేదన్నారు చంద్రబాబు. రైతులకు ఏడాదికి రూ. 7 వేలు ఇచ్చి.. ఇతరత్రా వారిని పూర్తిగా విస్మరించారు. రాజకీయాల్లో వర్గ ద్వేషాలు ఉండకూడదు.

కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకోవడం ఎప్పుడూ చూడలేదు. పవన్ పై కోపంతో ఒక సామాజికవర్గాన్ని, టీడీపీపై కోపంతో మరో వర్గాన్ని, రఘరామకృష్ణం రాజుపై కోపంతో మరో వర్గాన్ని టార్గెట్ చేశారు. జగనులో అపరిచితుడు ఉన్నాడు. జగన్ చెప్పే వాటికి చేసే వాటికి సంబంధం ఉండదు. వైసీపీ ఇప్పుడు ఓడిపోతే మళ్లీ జీవితంలో అధికారంలోకి రాదు అనేదే జగన్ ఫ్రస్టేషనుకు కారణం. ఫ్రస్టేషనుతోనే జగన్ భాష మారింది.

Read Also: Governor Tamilisai : ఎన్నికయిన సీఎంలు నియంతలుగా మారుతున్నారు

కెబినెట్ విస్తరణతో జగన్ బలహీనుడని తేలిపోయింది. ఒత్తిళ్లతో సగం మందిని కేబినెట్లో తిరిగి కొనసాగించారు.. దీంతో బయట తిరుగుబాట్లు మొదలయ్యాయి. కేబినెట్ విస్తరణ అనంతరం బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రాలేదు. భవనం వెంకట్రామ్ కూడా ఇంత బలహీనంగా కనిపించలేదు. నా ఇంటి మీద దాడికి వచ్చిన వారికి.. లోకేషును దూషించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రి పదవులు పొందడానికి ఇదేనా అర్హత.

ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంన్నాం. బాదుడే బాదుడు పేరుతో టిడిపి చేస్తున్న పోరాటంలో నేనూ పాల్గొంటాను. మహానాడు వరకు బాదుడే బాదుడు కార్యక్రమం ఉంటుంది. మే మొదటి వారం నుంచి నా పర్యటనలు మొదలు అవుతాయి. మహానాడు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్త్రృతంగా పర్యటనలు చేపడతానన్నారు చంద్రబాబు. నెలకు రెండు జిల్లాల చొప్పున ఏడాదిలో అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేస్తానన్నారు. ఒంగోలులో మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పారు.

Show comments