టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను అధికారులు కూల్చివేశారు. అయితే ఈ ఘటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు మాట్లాడుతూ.. అయ్యన్న పాత్రుడి ఇంటిపై జగన్ చీకటి దాడులు చేసిందంటూ ఆయన మండిపడ్డారు. అయ్యన్న ఇంటి గోడ అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపేనని ఆయన ఆరోపించారు. టీడీపీలో బలమైన బీసీ నేతలని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకి జగన్ పాల్పడుతున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
చోడవరం మినీమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారనే అక్కసుతోనే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అయ్యన్న అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా సమాధానం ఇచ్చే దమ్ములేని జగన్ కూల్చివేతలకి పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడి వెంట తెలుగుదేశం పార్టీ ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
