NTV Telugu Site icon

Chandrababu: వివేకా హత్య కేసులో సూత్రధారి ఎవరో తెలిసిపోయింది

అమరావతి: టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీలో ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో సూత్రధారి ఎవరో తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందన్నారు. వివేకా హత్య కేసులో జగన్ పూర్తిగా కూరుకుపోయారని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యను గతంలో తనపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని.. బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనమయ్యారని విమర్శించారు.

వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది.. అది తనపై 12వ కేసు అవుతుందని జగన్ వ్యాఖ్యానించడం ఆయనకు చట్టం అంటే లెక్కలేనితనాన్ని స్పష్టం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్ ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు గ్యాంగ్ ఆర్డర్ తేవడం నుంచి ఇప్పుడు సీబీఐ విచారణను తప్పు పట్టడం వరకు అన్ని విషయాలు వివేకా హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయని.. ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు డైవర్ట్ పాలిటిక్స్ అమలు చేస్తున్న జగన్.. ఈ విషయంలో ప్రజలను ఏమార్చలేరని చంద్రబాబు అన్నారు.

వివేకా హత్యను పాత్రధారులకే పరిమితం చేసి సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఏ పౌరుడి ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్ కోటలోనే వైఎస్ తమ్ముణ్ని హత్యచేయడం అంత:పుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమా అని నిలదీశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్ధుల బాధలు కలిచి వేస్తున్నాయని.. రష్యా -ఉక్రెయిన్ యుద్ధం పేరుతో అప్పుడే వంటింటి నూనె రేట్లు పెంచేశారని చంద్రబాబు తెలిపారు. రానున్న రోజుల్లో నూనె రేట్లు మరింత భారం కాకుండా ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. కాగా టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో జరగుతున్న పరిణామాలపై టీడీపీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనం, జిల్లాల విభజన విషయంలో శాస్త్రీయత అనేది లేదని అభిప్రాయపడ్డారు.