NTV Telugu Site icon

Chandrababu Arrested Live Updates: చంద్రబాబుకు రిమాండ్.. ఏపీలో 144 సెక్షన్!

Chandrababu

Chandrababu

Chandrababu Arrested Live Updates: నారా చంద్రబాబు రిమాండ్‌పై ఓపెన్ కోర్టులో విచారణ చేపట్టారు.. 409 సెక్షన్ కింద వాదనలు వినిపిస్తున్నారు. 409 సెక్షన్ పెట్టడం సబబు కాదంటున్న చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా.. 409 పెట్టాలంటే ముందుగా సరైన సాక్ష్యం చూపాలంటున్న లూథ్రా.. రిమాండ్ రిపోర్ట్‌ను తిరస్కరించాలని లూథ్రా నోటీసులు జారీ చేశారు. తిరస్కరణపై న్యాయమూర్తి వాదనలకు అనుమతించారు. కేసులో తన వాదనలు వినాలని కోరిన చంద్రబాబు.. కోర్టులో చంద్రబాబు మాట్లాడుతున్నారు.

The liveblog has ended.
  • 10 Sep 2023 10:02 PM (IST)

    టీడీపీ బంద్ కు జనసేన సంఘీభావం

    టీడీపీ బంద్ కు జనసేన సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్ పిలుపునకు జనసేన మద్దతు ఉంటుందని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తోందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును జనసేన పార్టీ ఇప్పటికే ఖండించిందని తెలిపారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోందని దుయ్యబట్టారు. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు పెడుతున్నారని తెలిపారు. అరెస్టులతో వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ నిరసిస్తుందని.. రేపు జరగబోయే బంద్ లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

  • 10 Sep 2023 08:51 PM (IST)

    చంద్రబాబు పాపం పండింది- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

    చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాాండ్ విధించడంపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పాపం పండిందని ఆరోపించారు. ఇంకా అనేక కుంభకోణాలు ఉన్నాయి.. అన్ని ఇక వెలుగులోకి వస్తాయని తెలిపారు. పదవి విక్షుడిని చేసి అవమానించి క్షోభకు గురిచేసిన ఎన్టీఆర్(NTR) ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందన్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ చంద్రబాబు గురించి బాధపడటం విడ్డూరమన్నారు. ముద్రగడ్డ పద్మనాభంను ఆనాడు ఇబ్బందులు పెట్టినప్పుడు స్పందించని వాడు.. ఇప్పడు మాట్లాడటం ప్రజలతో పాటు ఆయన వర్గం‌ వారు కూడ అసహ్యయించుకుంటున్నారని కారుమూరి విమర్శించారు.

  • 10 Sep 2023 07:56 PM (IST)

    చంద్రబాబును రిమాండ్ కు పంపండంతో టీడీపీ శ్రేణులు ఆందోళన

    విజయనగరం జిల్లా గజపతినగరంలో చంద్రబాబు నాయుడును రిమాండ్ కు పంపండంతో టీడీపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కారు. జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి ఆందోళనకు దిగారు. మరోవైపు జాతీయ రహదారిపైకి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  • 10 Sep 2023 07:28 PM (IST)

    రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరింపు

    రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సెంట్రల్ జైలు వద్ద సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. రాజమండ్రిలో 36 చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. రిమాండ్ నిమిత్తం చంద్రబాబును రాజమండ్రి తరలించనున్నారు పోలీసులు

  • 10 Sep 2023 07:24 PM (IST)

    చంద్రబాబుకు రిమాండ్ ఇవ్వడంతో వైసీపీ సంబరాలు

    చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ ఇవ్వడంతో మంత్రి ఆర్కే రోజా సంబరాలు చేసుకున్నారు. నగరిలో తన ఇంటి వద్ద టపాకాసులు కాల్చి జై జగన్ అంటూ నినాదాలు చేశారు.

  • 10 Sep 2023 07:22 PM (IST)

    రిమాండ్‌ విధించిన వెంటనే రెండు పిటిషన్లు దాఖలు

    చంద్రబాబుకు రిమాండ్‌ విధించిన వెంటనే చంద్రబాబు తరఫు న్యాయవాదులు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. గృహ నిర్బంధంలో ఉంచేందుకు అనుమతించాలని ఒక పిటిషన్‌ వేయగా.. ఇంటి భోజనం, మందులు ఇచ్చేందుకు మరొక పిటిషన్‌ వేశారు. ఈ కేసులో నేర తీవ్రత ఉందన్న వాదనలతో కోర్టు ఏకీభవిస్తోందని న్యాయమూర్తి అన్నారు.

  • 10 Sep 2023 06:49 PM (IST)

    చంద్రబాబుకు రిమాండ్

    స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది కోర్టు. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఈనెల 22 వరకు చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

  • 10 Sep 2023 05:20 PM (IST)

    తీర్పు కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు

    స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో తీర్పు కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. దీంతో చంద్రబాబు కోర్టు హాలులోనే వేచి ఉన్నారు. మరోవైపు పార్టీ నేతలు కేశినేని నాని, పయ్యావుల కేశవ్ ఇతర నేతలు అక్కడికి చేరుకుని చంద్రబాబుతో మాట్లాడుతున్నారు. తీర్పు రావటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. కోర్టు తీర్పు చదివే హాల్ కి భారీగా నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో హాల్ కిటకిటలాడుతుంది.

  • 10 Sep 2023 03:56 PM (IST)

    చంద్రబాబు కేసులో వాదనలు పూర్తి.. కాసేపట్లో తీర్పు

    చంద్రబాబు కేసులో వాదనలు పూర్తి అయ్యాయి. ఉదయం నుంచి ఏడున్నర గంటలకుపైగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా.. సీఐడీ తరఫున పొన్నవోలు వాదనలు వినిపించారు. ఇప్పుడు కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇంకాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. అవినీతి ఆరోపణలతో చంద్రబాబు తొలిసారి అరెస్ట్ అయ్యారు. నిన్న రాత్రంతా ఈడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించారు. రూ.271 కోట్ల స్కిల్ స్కాం సూత్రధారి చంద్రబాబేనంటూ సీఐడీ ఆరోపణలు చేసింది.

  • 10 Sep 2023 03:40 PM (IST)

    కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబును తరలించేందుకు కాన్వాయ్ సిద్ధం చేశారు.

  • 10 Sep 2023 03:16 PM (IST)

    అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేశారు- మంత్రి జోగి రమేష్

    అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేశారని మంత్రి జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయమని ఆరోపించారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఆవేదన చెందుతున్నాడని తెలిపారు. పవన్ కల్యాణ్ మంగళగిరికి ఎన్ని సార్లు రాలేదు.. ఎప్పుడైనా పోలీసులు అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. ఒక అవినీతిపరుడి కోసం శాంతి భద్రతల సమస్య సృష్టిస్తాం అంటే పోలీసులు ఊరుకోరన్నారు. జనాలను రోడ్ల మీదకు పంపించండి అని అచ్చెన్నాయుడు బతిమాలుకుంటున్నాడని విమర్శించారు.

  • 10 Sep 2023 02:27 PM (IST)

    సుదీర్ఘంగా వాదనలు:

    విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 7 గంటల తర్వాత ఇరు పక్షాల వాదనలు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు సీఐడీ తరఫున అదనపు ఏజీ పి. సుధాకర్‌రెడ్డి వాదిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యమధ్యలో పలుమార్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విరామం ఇచ్చారు. దాదాపు 7 గంటలకు పైగా వాదనలు కొనసాగుతున్నాయి.

  • 10 Sep 2023 02:15 PM (IST)

    గవర్నర్ అనుమతి అవసరం లేదు!

    ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదు, స్పీకర్‌కు సమాచారం ఇస్తే సరిపోతుందని, ఆ నియమాలను తాము పాటించాం అని సీఐడీ న్యాయవాది పేర్కొన్నారు. అవినీతి చేయలేదని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారని, ఎంతసేపు సాంకేతిక అంశాల గురించే మాట్లాడుతున్నారన్నారు.

  • 10 Sep 2023 01:50 PM (IST)

    తిరిగి ప్రారంభమైన వాదనలు:

    ఏసీబీ కోర్టులో తిరిగి ప్రారంభమైన వాదనలు.. వాదనలు వినిపిస్తున్న సీఐడీ తరఫు న్యాయవాది

  • 10 Sep 2023 01:06 PM (IST)

    టెన్షన్‌ వాతావరణం:

    ఏసీబీ కోర్టు లోపల, బయటా ప్రస్తుతం టెన్షన్‌ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధిస్తారా?, తిరస్కరిస్తారా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

  • 10 Sep 2023 01:00 PM (IST)

    ముగిసిన సిద్ధార్థ్ లూథ్రా వాదనలు:

    టీడీపీ అధినేత చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు ముగిసాయి. మధ్యాహ్నం 1.30కు తిరిగి వాదనలు ప్రారంభం కానున్నాయి. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారణకు గంట బ్రేక్ ఇచ్చారు.

  • 10 Sep 2023 12:33 PM (IST)

  • 10 Sep 2023 12:27 PM (IST)

    గవర్నర్‌ అనుమతిని సీఐడీ తీసుకోలేదు!

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు గవర్నర్‌ అనుమతి కావాలని, గవర్నర్‌ అనుమతిని సీఐడీ తీసుకోలేదని న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విజయవాడ ఏసీబీ కోర్టులో పేర్కొన్నారు.

  • 10 Sep 2023 12:15 PM (IST)

    30 మందికి మించి ఉండకూడదు: జడ్జి

    కోర్టు హాలులో 30 మందికి మించి ఉండకూడదని మరోసారి జడ్జి చెప్పారు. విచారణ హాలు నుంచి మిగతా వారిని బయటకు వెళ్లాలని జడ్జి కోరారు. 17ఏ సెక్షన్ గురించి సిద్ధార్థ్ లూథ్రా వివరిస్తున్నారు.

  • 10 Sep 2023 11:59 AM (IST)

    చంద్రబాబు లండన్ వెళ్లడం లేదు:

    సీఐడీ ఆరోపిస్తున్నట్లు మాజీ సీఎం నా చంద్రబాబు లండన్ వెళ్లడం లేదని న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఏసీబీ కోర్టులో తెలిపారు. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశామని సీఐడీ చెబుతోందని, ముందురోజు రాత్రి 11 గంటలకే ఆయనను సీఐడీ పోలీసులు చుట్టుముట్టారని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 నుంచి సీఐడీ అధికారుల ఫోన్‌ సంభాషణలను కోర్టుకు సమర్పించాలని కోరారు.

  • 10 Sep 2023 11:38 AM (IST)

    చంద్రబాబు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు: కన్నా

    మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై టీడీపీ సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. 'స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ అంటూ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు మీద పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడవు. 2021లో ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. ఇప్పుడు రిమాండ్‌ రిపోర్టులో చంద్రబాబు పేరు చేర్చడం సరికాదు. ప్రజా కోర్టులో వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు' అని కన్నా అన్నారు.

  • 10 Sep 2023 11:26 AM (IST)

    టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్‌!

    టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఆదివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. రవీంద్ర శనివారం ఉదయం నుంచి పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాంతో ఆయనను గుణదల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

  • 10 Sep 2023 11:12 AM (IST)

    కుప్పంలో టీడీపీ శ్రేణుల నిరాహార దీక్ష!

    టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండు వద్ద టీడీపీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టాయి. నాలుగు మండలాల నాయకులు నిరాహార దీక్షలో కూర్చున్నారు.

  • 10 Sep 2023 11:02 AM (IST)

    విరామం అనంతరం మళ్లీ ప్రారంభమైన వాదనలు!

    ఏసీబీ కోర్టులో తిరిగి ప్రారంభం అయిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు వాదనలు.. చంద్రబాబు తరఫున వాదనలు ప్రారంభించిన సిద్ధార్థ్ లూథ్రా.

  • 10 Sep 2023 10:56 AM (IST)

    చంద్రబాబు భార్య భువనేశ్వరికి సెన్స్ ఉందా?: మంత్రి రోజా

    స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై ఏపీ మంత్రి రోజా స్పందించారు. 'మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కారణాలు లేకుండా అరెస్ట్ చేయరు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే కేసు నిలబడదు. బోగస్ కంపెనీలు పెట్టి డబ్బులు అకౌంట్లోకి తెచ్చుకున్నారు. చట్టం ఎవరికైనా సమానమే. విచారణలో చాలా పేర్లు, అకౌంట్స్ బాయటికి వస్తాయి. లోకేష్, అతడి స్నేహితులు రియల్ ఎస్టేట్ చేస్తున్నది ముందే చెప్పాము. బాబు భార్య భువనేశ్వరికి సెన్స్ ఉందా?. తప్పు చేసిన భర్తను కాపాడాలని దేవుడిని వేడుకోవడం న్యాయమా?' అని రోజా ప్రశ్నించారు.

  • 10 Sep 2023 10:38 AM (IST)

    ఏసీబీ కోర్టులో విచారణకు కాసేపు విరామం!

    ఏసీబీ కోర్టులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు కేసు విచారణలో కాసేపు విరామం ప్రకటించారు. ఇప్పటివరకు వాదనలు వాడివేడిగా సాగాయి. 2021లో కేసు నమోదైతే ఇప్పటివరకు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని న్యాయమూర్త్తి ప్రశ్నించారు.

  • 10 Sep 2023 09:52 AM (IST)

    కోర్టులో వివరాలు తెలుపుతున్న ఏఏజీ!

    సీఐడీ తరఫున ఏఏజీ పి. సుధాకర్ రెడ్డి వాదనలు ప్రారంభించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే ప్రవేశపెట్టామని ఏఏజీ తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణ సమయాన్ని మినహాయించవచ్చని.. A 35, మరో ఏడుగురిని సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసిందని ఏఏజీ పేర్కొంది.

  • 10 Sep 2023 09:27 AM (IST)

    మరోసారి నిర్బంధంలో అచ్చెన్నాయుడు

    మరోసారి నిర్బంధంలో అచ్చెన్నాయుడు సహా టీడీపీ మాజీమంత్రులూ, ఎమ్మెల్యేలు. చంద్రబాబు అరెస్ట్ పై గవర్నర్ ను కలవాలనే టీడీపీ ప్రతినిధుల ప్రయత్నంలో గందరగోళం పరిస్థితి నెలకొంది. రెండోసారి గవర్నర్ అపాయింట్ మెంట్ వాయిదా పడింది. సాయంత్రం లేదా రేపు మరోసారి కలవాలని టీడీపీ నేతల ఆలోచన.

  • 10 Sep 2023 09:26 AM (IST)

    టీడీపీ ప్రతినిధుల ప్రయత్నంలో గందరగోళం.. గవర్నర్ అపాయింట్ మెంట్ వాయిదా

    చంద్రబాబు అరెస్ట్ పై గవర్నర్ ను కలవాలనే టీడీపీ ప్రతినిధుల ప్రయత్నంలో గందరగోళం పరిస్థితి నెలకొంది. రెండోసారి గవర్నర్ అపాయింట్ మెంట్ వాయిదా పడింది. సాయంత్రం లేదా రేపు మరోసారి కలవాలని టీడీపీ నేతల ఆలోచన. మరోసారి నిర్బంధంలో అచ్చెన్నాయుడు సహా టీడీపీ మాజీమంత్రులూ, ఎమ్మెల్యేలు.

  • 10 Sep 2023 09:25 AM (IST)

    చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి ప్రతినిధులు గవర్నర్ కు ఫిర్యాదు

    గవర్నర్ బస చేసిన హార్బర్ పార్క్ దగ్గర పోలీసులు మోహరింపు. మరికొద్దిసేపట్లో గవర్నర్ ను కలవనున్న టీడీపీ ప్రతినిధులు. అచ్చన్నాయుడు, అయ్యన్న, గంటా శ్రీనివాసరావు సహా 11మందితో కూడిన బృందం. చంద్రబాబు అరెస్ట్ అనంతరం పరిణామాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయం. 9.45నిముషాలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన గవర్నర్. అచ్చన్నాయుడు, అయ్యన్న కదలికలపై కొనసాగుతున్న పోలీసులు నిఘా.

  • 10 Sep 2023 09:12 AM (IST)

    నేను ఏ తప్పూ చేయలేదు- చంద్రబాబు

    నేను ఏ తప్పూ చేయలేదు.. నాపై రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారు... శనివారం ఉదయం 5.40కి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.. ఈరోజు 5.40కి రిమాండ్ రిపోర్ట్‌ ఇచ్చారు.. వాదోపవాదాలు అయ్యేవరకు కోర్టులోనే ఉంటాను: చంద్రబాబు

  • 10 Sep 2023 09:11 AM (IST)

    న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

    న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ.. రిమాండ్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించిన సీఐడీ అధికారులు.. రిమాండ్ రిపోర్ట్‌లో నారా లోకేష్ పేరు.. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న సీఐడీ.. రిమాండ్ రిపోర్ట్‌లో బయటకొచ్చిన కీలక అంశాలు