Site icon NTV Telugu

Chandra Babu: మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

Chandrababu

Chandrababu

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. విద్యా శాఖలోకి మున్సిపల్ స్కూళ్ల విలీనం ప్రభుత్వ కుట్ర అని మండిపడ్డారు. ఏపీలో 2,115 పురపాలక పాఠశాలలకు చెందిన వేల కోట్ల ఆస్తుల కోసమే విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ తన స్వార్థం కోసం నాలుగున్నర లక్షల విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడతారా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విలీన ప్రతిపాదనపై మున్సిపల్ టీచర్ల పోరాటానికి టీడీపీ మద్దతు ఇస్తుందని తెలిపారు.

Perni Nani: పవన్ పదో తరగతి ఫెయిల్.. అందుకే ఆయన అలా..!!

పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ స్కూళ్లు పేద, బడుగు వర్గాల విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఎంతో కీలకంగా ఉన్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రైవేటు స్కూళ్ల నుంచి కూడా మున్సిపల్ స్కూళ్లకు అడ్మిషన్లు వస్తున్నాయని.. కొన్ని పురపాలక పాఠశాలల్లో సీట్లు లేక నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి తెలియదా అని చురకలు అంటించారు. నిన్నటి వరకు ఎయిడెడ్ స్కూళ్లను టార్గెట్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మున్సిపల్ స్కూళ్ల ఆస్తులపై కన్నేసిందని విమర్శించారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని.. ప్రభుత్వ ప్రతిపాదనలు హైకోర్టు ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయని చంద్రబాబు మండిపడ్డారు.

Exit mobile version