ChandraBabu: టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రోడ్ షోలు, బాదుడే బాదుడు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన నన్నూరు మీదుగా కర్నూలు బైపాస్, బళ్లారి చౌరస్తా, పెద్దపాడు, కోడుమూరు, కరివేముల, దేవనకొండ, దూదేకొండ మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ సాయంత్రం 4 గంటలకు పత్తికొండకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు పత్తికొండలో బహిరంగ సభలో మాట్లాడతారు. రాత్రి 8:30 గంటలకు ఆదోనీ చేరుకుని అక్కడే బస చేయనున్నారు.
Read Also: Tamota Prices: దారుణంగా పడిపోయిన టమోటా ధరలు.. కిలో కేవలం రూపాయే
రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం ఉదయం 10:30 గంటలకు ఆదోనీ రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు. పోలీస్ కంట్రోల్ రూం వద్ద 10 నిమిషాలు కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత దర్గా సెంటర్, ఆర్ట్స్ కళాశాల మీదుగా రోడ్ షో సాగుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం చేరుకుంటారు. ఈ మండలంలో వెంకటాపురం నుంచి చంద్రబాబు రోడ్ షో ప్రారంభించనున్నారు. బసవాసి, నవోదయా స్కూల్ మీదుగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, అన్నమయ్య సర్కిల్, శివ సర్కిల్, సోమప్ప సర్కిల్, శ్రీనివాస-సోమేశ్వర సర్కిల్ మీదుగా తేరుబజార్‌కు చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గురువారం రాత్రి కర్నూలు వెళ్లి బస చేయనున్నారు.
మూడోరోజు పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో విడివిడిగా మాట్లాడి సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి కార్యాలయ నూతన భవనం ప్రారంభిస్తారు.