Site icon NTV Telugu

AP CM Jagan: జగన్ నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం నాడు విజయవాడలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. పర్యటన అనంతరం నితిన్ గడ్కరీ తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. అనంతరం ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

కాగా అంతకుముందు బెంజి సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సమయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఏపీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని.. సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్రం పురోగామి పథంలో పయనిస్తోందని కొనియాడారు. ఏపీకి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎంతో కీలకమైనవని, వ్యవసాయ రంగంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందుతోందన్నారు. భారతదేశ అభివృద్ధిలో ఏపీ భాగస్వామ్యం కీలకమని భావిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి అభివృద్ధిలో పోర్టులది కీలక పాత్ర అని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

Exit mobile version