Narayana Swamy: ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రమంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో పశ్చిమ బైపాస్ పనులను పరిశీలించిన ౠయన రహదారి పనులను నేషనల్ హైవే అథారిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పశ్చిమ బైపాస్ విస్తరణ తర్వాత అమరావతి ఒక జిల్లాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వ సహకారం ఆశించిన స్థాయిలో లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాజధానులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కానీ అమరావతిలో అభివృద్ధి మాత్రం ఆగకూడదని నారాయణస్వామి హితవు పలికారు.
Read Also: AP Assembly: అసెంబ్లీ సమావేశాల తొలిరోజే మూడు రాజధానులపై చర్చ..?
అమరావతిని రాజధానిగా అందరూ గుర్తించారని.. అందుకే ఎయిమ్స్ కేటాయించామని.. జాతీయ రహదారులను మంజూరు చేశామని కేంద్రమంత్రి నారాయణస్వామి చెప్పారు. వివాదాస్పద నిర్ణయాలతో అభివృద్ధి ఆగకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అమరావతిలో అభివృద్ధి పనులు పూర్తి కావడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోకుండా.. నిర్లక్ష్యం చేయడంతోనే రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందని నారాయణస్వామి విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాతో పాటు అమరావతి అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వ ఆలోచనన అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఒక రాజధాని పెడతారా.. మూడు పెడతారో వైసీపీ సర్కారు ఇష్టమని.. కానీ అమరావతిని అభివృద్ధి చేయాలన్నదే తమ అభిమతమని నారాయణస్వామి పేర్కొన్నారు.
