NTV Telugu Site icon

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై దూకుడు.. స్ట్రాటజిక్ సేల్ తప్పదన్న కేంద్రం

Vizag Steel Plant

Vizag Steel Plant

Central Govt Focus On Vizag Steel Plant Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం దూకుడు పెంచింది. రాజకీయ పార్టీలు, స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, రాష్ట్ర ప్రజలు ఈ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ముందుకే సాగాలని కేంద్రం నిర్ణయించింది. స్ట్రాటజిక్ సేల్ తప్పదని మరోసారి ప్రకటించింది. పెట్టుబడుల ఉపసంహరణ విధివిధానాలను ఖరారు చేస్తోంది. ప్రైవేటీకరణ అనివార్యమని దీపమ్ కార్యదర్శి తుహీన్ కాంత్ పాండే వెల్లడించారు. ఇప్పటికే లీగల్, ట్రాన్సక్షన్ అడ్వైజర్ల నియామకం కోసం బిడ్‌లు దాఖలయ్యాయి. విశాఖ ఉక్కు కొనుగోళ్ల రేసులో పలు దేశ, విదేశీ కంపెనీలు ఉన్నాయి. ఇంతవరకూ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యంతో సంప్రదింపులు చేసిన కేంద్రం.. ఇప్పుడు విశాఖ జిల్లా కలెక్టర్‌ నుంచి వివరాలు సేకరిస్తోంది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రైవేటీకరణ చర్యల అమలు తీరు ఎలా ఉంది? ప్రస్తుతం ఏం జరుగుతోంది? మేనేజ్‌మెంట్‌ ఎలాంటి చర్యలు అమలు చేస్తోంది? అనే విషయాలపై కేంద్ర ఉక్కు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆరా తీస్తోంది. మరోవైపు.. సెయిల్లో విలీనం దిశగా ప్రయత్నాలు చేయాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే.. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు విశాఖ కార్మిక వర్గం పోరాడుతూనే ఉంది. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తమ ఆందోళనలను ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఈ పోరాటాన్ని ప్రారంభించి ఈనెల 27తో రెండేళ్లు కావొస్తున్న సందర్భంగా.. ఈ నెల 10న మానవ హక్కుల దినోత్సవం రోజున భారీ సదస్సు నిర్వహించాలని ఫిక్స్ అయ్యింది.