Site icon NTV Telugu

YSR Village Clinics: కేంద్రం ప్రశంసలు.. ఏపీలో ఆరోగ్య సేవలు భేష్‌

Ysr Village Clinics

Ysr Village Clinics

YSR Village Clinics: ఎన్నో సంక్షేమ పథకాలతో అందరికీ లబ్ధి చేకూరేలా చూస్తుంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవలపై ప్రశంసలు కురిపించింది కేంద్ర ప్రభుత్వం.. ఏపీలోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) నిరంతర సేవలతో అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నాయంటూ పార్లమెంట్‌కు వెల్లడించింది కేంద్రం… రాష్ట్రంలో నూటికి నూరు శాతం గ్రామీణ పీహెచ్‌సీలు 24 గంటలూ పని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు వందకు వంద శాతం 24 గంటలపాటు పనిచేయడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో అగ్రస్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది.. ఆ తరువాత స్థానంలో సిక్కిం ఉండగా.. దేశవ్యాప్తంగా మరే రాష్ట్రంలోనూ ఏపీ తరహాలో నూటికి నూరు శాతం పీహెచ్‌సీలు నిరంతరం సేవలందించడం లేదని పేర్కొంది.

Read Also: Minister KTR : నేడు హనుమకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా అవన్నీ నూటికి నూరు శాతం 24 గంటలు పని చేస్తున్నాయని తెలిపింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. ఇక, సిక్కింలో 24 పీహెచ్‌సీలుండగా అవి కూడా 24 గంటల పాటు సేవలందిస్తున్నాయి. మరోవైపు.. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 24,935 పీహెచ్‌సీలుండగా 11,250 పీహెచ్‌సీలు మాత్రమే అంటే 45.1 శాతం 24 గంటలు పని చేస్తున్నాయని పేర్కొంది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపరచేందుకు ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ను నిర్దేశించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందులో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, డయాగ్నస్టిక్స్, పరికరాలు, మందులు తదితరాలకు సంబంధించిన నిబంధనలున్నాయి. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.. ఏపీలో గత మూడున్నరేళ్లలో ప్రజారోగ్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇక, దేశంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ తరువాత ఏపీలోనే అత్యధికంగా సబ్‌ హెల్త్‌ సెంటర్లున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 20,781 సబ్‌ హెల్త్‌ సెంటర్లు ఉంటే.. రాజస్థాన్‌లో 13,589 సబ్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో గత మూడున్నరేళ్లలో కొత్తగా 304 పీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు.. మరో 179 కేంద్రాల పనులు ప్రారంభించారు.

Exit mobile version