NTV Telugu Site icon

Central Government: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

Special Status

Special Status

Central Government: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని రాజ్యసభ వేదికగా వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని.. జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సంబంధించి 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపలేదని కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు.

అటు ప్రణాళిక, ప్రణాళికేతర కింద రాష్ట్రాల అవసరాల మేరకు నిధులు బదలాయించేందుకు 14వ ఆర్థిక సంఘం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుందని.. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే 2015-20 మధ్య రాష్ట్రాలకు పంచే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42శాతానికి కేంద్రం పెంచిందని కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. దీనికి కొనసాగింపుగా 15వ ఆర్థిక సంఘం కూడా 41శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసిందన్నారు. నిధుల పంపిణీ ద్వారా వీలైనంత మేరకు ప్రతి రాష్ట్రానికి వనరులు అందించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. నిధుల పంపిణీ తరువాత కూడా వనరుల లోటు ఉండే రాష్ట్రాలకు.. రెవెన్యూ లోటు పూడ్చేందుకు గ్రాంట్స్ అందిస్తోందని వివరించారు.

Read Also: Ramakrishna Math: బుక్ లవర్స్‌కు శుభవార్త.. పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్

మరోవైపు పోలవరంపైనా కేంద్ర ప్రభుత్వం ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతోందా అని వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించగా.. షెడ్యూల్‌ ప్రకారం 2024 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉందని కేంద్ర జలశక్తి సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడు సమాధానం చెప్పారు. వివిధ కారణాల దృష్ట్యా గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. 2019 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ.6,461.88 కోట్లు విడుదల చేసిందని వివరించారు.

Show comments