Site icon NTV Telugu

Andhra Pradesh Casino: గెట్ టుగెదర్ పేరుతో అనుమతులు.. క్యాసినో నిర్వహణకు ఏర్పాట్లు

Krishna District Casino

Krishna District Casino

ఏపీలో మరోసారి క్యాసినో పాలిటిక్స్ బహిర్గతం అయ్యాయి. గతంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తాజాగా కృష్ణా జిల్లాలో మరోసారి క్యాసినో కలకలం రేగింది. ఓ గోవా కంపెనీ గెట్ టుగెదర్ పేరుతో పార్టీ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. కాక్‌టైల్ డిన్నర్, సినీ హీరోయిన్‌ల స్టెప్పులు, సింగర్ల పాటలు, మధురమైన అనుభూతి ఉంటుందని నిర్వాహకులు ప్రచారం చేశారు. దీని కోసం ఆకర్షణీయమైన ఆహ్వాన పత్రాలను పంపారు. భారీ ఏర్పాట్లతో హోరెత్తించారు. కానీ కథ మొత్తం అడ్డం తిరిగింది.

పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు వేదికగా ఆయానా కన్వెన్షన్ సెంటర్‌లో గోవా మెజిస్టిక్ సంస్థ క్యాసినో ఆడించేందుకు సర్వం సిద్ధం చేసింది. మంగళవారం రాత్రి క్యాసినో నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. సంపన్నులు, ప్రముఖులు, కొందరు నేతలకు ఈ ఈవెంట్‌కు సంబంధించి ఆహ్వాన పత్రికలు అందాయి. ఓ ఈవెంట్ పేరుతో గోవా నుంచి అమ్మాయిలు, సినిమా హీరోయిన్‌లు, సింగర్లు వస్తున్నారని నిర్వాహకులు ఊదరగొట్టారు. సినీ తారలకు భారీగానే అడ్వాన్సులు చెల్లించారు. కన్వెన్షన్ సెంటర్‌కు క్యాసినో పేరుతో అడ్వాన్సులు చెల్లించారు. ఎంట్రీ ఫీజు రూ.20వేలు వరకు పెట్టినట్లు తెలుస్తోంది. హైటెక్ పార్టీ పేరుతో రెండు రోజుల పాటు ఏర్పాట్లు చేస్తూ యూత్‌లో జోష్ పెంచారు. గెట్ టుగెదర్ పార్టీ తరహాలో ఈవెంట్ ఉంటుందని కంకిపాడు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మద్యం సరఫరాకు అనుమతి ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు. దీంతో గెట్ టుగెదర్ పార్టీనే కదా అని పోలీసులు కూడా అనుమతి ఇచ్చేశారు.

అయితే గోవా కంపెనీ ముద్రించిన ఆహ్వాన పత్రాలు బయటకు రావడంతో ఇది క్యాసినో పార్టీ అని తేలిపోయింది. మీడియాలో వరుస కథనాలు రావడంతో క్యాసినో నిర్వాహకుల దూకుడుకు బ్రేక్ పడింది. అయితే అధికారులు ఎవరికి వారు తాము ఈ పార్టీకి అనుమతులు ఇవ్వలేదని చేతులెత్తేశారు. కరోనా కారణంగా గోవాలో క్యాసినో నిర్వహణకు బ్రేక్ పడిందని మెజిస్టిక్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం రెగ్యులర్ కస్టమర్లకు గెట్ టుగెదర్ తరహాలో పార్టీ ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. ఏప్రిల్ 13న హైదరాబాద్‌లో ఈవెంట్ ఏర్పాటు చేశామని.. ఏపీ కోసం కంకిపాడులో పార్టీ పెట్టగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రద్దు చేశామని తెలిపారు. అయితే ఈ క్యాసినో పార్టీ నిర్వహణలో పలువురు రాజకీయ నేతలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.

Exit mobile version