NTV Telugu Site icon

మదనపల్లిలో ఎక్సైజ్ పోలీస్ అధికారులపై కేసులు నమోదు

చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఎక్సైజ్ పోలీస్ అధికారులపై కేసులు నమోదు చేసిన ఘటన చోటు చేసుకుంది. ఓ బార్ లో దౌర్జన్యానికి దిగిన ఎక్సైజ్ సీఐ జవహర్, ఎస్సై సురేష్ బాబులపై పోలీసు కేసు నమోదు చేసారు. పట్టణంలోని ఆనంద్ బార్ అండ్ రెస్టారెంట్ లో అనధికార యాజమాన్య వాటాను ఎక్సైజ్ సీఐ జవహర్ కొనసాగించారు. అయితే లావాదేవీల విషయంలో బార్ లీజుదారు శివ తో సీఐ జవహర్ గొడవపడ్డాడు. దీంతో ఎస్సై తో పాటు మరో 30 మందిని వెంట తీసుకెళ్లి బార్ లో సీఐ జవహర్ దౌర్జన్యానికి దిగాడు.

అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో బార్ లీజు దారు శివ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు… ఎక్సైజ్ సీఐ, ఎస్ఐలపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ మద్యం గోడౌన్ నుంచి అక్రమంగా పెద్ద మొత్తంలో మద్యం బార్ కు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు మీడియాకు ఎస్ఈబీ అదనపు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు.