NTV Telugu Site icon

Buddha Venkanna: జగనూ.. ఆ కుంభకోణంపై ఏ యాప్‌లో ఫిర్యాదు చేయాలి?

Buddha Venkanna On Acb App

Buddha Venkanna On Acb App

అవినీతి నిర్మూలనపై ‘ఏసీబీ 14400’ యాప్‌ను సీఎం లాంచ్ చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతికి చట్టబద్దత కల్పించిన జగన్.. అవినీతి నిర్మూలనపై యాప్ ప్రారంభించటం హాస్యాస్పదంగా ఉందంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న ఎద్దేవా చేశారు. తీవ్రవాద సంస్థలు ప్రవచనాలు చెప్పినట్లు.. జగన్ ఈ అవినీతి యాప్‌ని విడుదల చేసినట్లుందని పేర్కొన్నారు. మద్యం, ఇసుక ద్వారా జగన్ రూ. 5 వేల కోట్ల అవినీతి డబ్బుల్ని సంపాదించారని ఆరోపించిన వెంకన్న.. ఈ కుంభకోణంపై ఏ యాప్‌లో ఫిర్యాదు చేయాలో జగనే చెప్పాలని తెలిపారు.

అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జగన్.. సహచర అవినీతి పరులైన విజయసాయి, నిరంజన్ రెడ్డిలను చట్ట సభలకు పంపాడని వెంకన్న వ్యాఖ్యానించారు. అవినీతి పరులకు పదవులిస్తూ.. అవినీతి నిర్మూలన మంత్రులకు వర్తించదన్నట్లుగా జగన్ వ్యవహార శైలి ఉందని చెప్పారు. నిజమైన అవినీతిపరుల్ని రక్షిస్తూ.. ఉద్యోగులపై కక్ష సాధించేందుకే జగన్ ఈ యాప్‌ని విడుదల చేశారని ఆగ్రహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు.. మరో యాప్ పెట్టే దమ్ము సీఎం జగన్‌కి ఉందా? అని బుద్ధ వెంకన్న ఛాలెంజ్ చేశారు.

ఇదిలావుండగా.. సీఎం జగన్ ఆదేశాల మేరకు అవినీతి నిర్మూలనకు అధికారులు తయారు చేసిన ఏసీబీ యాప్‌ను సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పిన జగన్.. ఈచరిత్రలో ఎప్పుడూలేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. ఎక్కడైనా, ఎవరైనా లంచం అడిగితే.. ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్‌ చేసి, బటన్‌ ప్రెస్‌చేసి వీడియో ద్వారా కానీ, ఆడియో ద్వారా కానీ సంభాషణను రికార్డు చేస్తే, ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుందని జగన్ అన్నారు.