ఏపీలోని అన్ని మున్సిపాలిటీల్లో త్వరలోనే ఆకస్మిక తనిఖీలు చేపడతామని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు పురపాలిక, నగరపాలికల కమిషనర్లతో మంత్రి బొత్స వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, క్లాప్ కార్యక్రమం అమలుపై బొత్స సమీక్షించారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ, తరలింపునకు 3100 కొత్త ఆటోల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే నెల 8 నుంచి 100 రోజులపాటు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నివాస, వాణిజ్య ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాల సేకరణ, తరలింపునకు చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు ఉదయమే క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పాలసీ తదితరాలకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలన్నారు.
ఆకస్మిక తనిఖీలు చేపడతాం: మంత్రి బొత్స
