BJP Sankalpa Yatra In Amaravati Villages To Ends Today: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగడానికి ఇంకా చాలా సమయమే ఉన్నా.. ఆ వాతావరణాన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడే తలపిస్తున్నాయి. ఒకదానికి మంచి మరొక పార్టీ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు, సభలు చేపబడుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అటు.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇక తామూ ఏం తక్కువ కాదన్నట్టు.. బీజేపీ రాజధాని గ్రామాల్లో ‘మనం మన అమరావతి’ నినాదంతో సంకల్ప యాత్రని చేపట్టింది. నేటితో ఈ యాత్ర ముగియనుంది.
శాఖమూరు, నేలపాడు మీదుగా తుళ్లూరు వరకు ఈ యాత్రని కొనసాగించి.. తుళ్లూరు బహిరంగ సభతో ఈ యాత్రని ముగించనున్నారు. ఈ సభలో సృజన చౌదరి, సత్యకుమార్ కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. వారం రోజుల పాటు సాగిన ఈ పాదయాత్రలో భాగంగా అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో పలువురు బీజేపీ నేతలు పర్యటించారు. ఉండవల్లిలో రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ పాదయాత్రను ప్రారంభించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ఇచ్చిన నిధులు, చేసిన పనులపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కూడా నిప్పులు చెరిగారు.
రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఓసారి రూ. 4 వేలకోట్లు, మరోసారి రూ. 2,500 కోట్లు నిధులు మంజూరు చేసిందని.. ఈ పాదయాత్రలో భాగంగా సోము వీర్రాజు చెప్పారు. కానీ.. ఈ నిధుల్ని అమరావతి నిర్మాణానికి వినియోగించలేదని ఆరోపించారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పి సీఎం జగన్ మాట మార్చాడని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. రెండు ప్రభుత్వాల వల్లే అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని సోము వీర్రాజు విమర్శించారు.
