Site icon NTV Telugu

ఏపీ వరద సహాయక చర్యలపై రాములమ్మ ట్వీట్‌

ఏపీ వర్షాలపై బీజేపీ నేత విజయశాంతి ట్వీట్‌ చేశారు. ఎడతెగని వర్షాలతో కన్నీటి కడలిలా మారిన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల అగచాట్లు చూస్తుంటే గుండె బరువెక్కుతుం దన్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఊళ్ళను ముంచెత్తాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిలో అయినవారు కళ్ళముందే కొట్టుకుపోయారన్నారు. ఇన్నాళ్ళూ తోడుగా ఉండి…. మన ఇంటి మనుషుల్లా… ప్రాణానికి ప్రాణంగా పెంచి పోషించుకున్న పశుసంపద మౌనంగా రోదిస్తూ జలప్రవాహంలో కలిసిపోయింది. పిల్లాపాపల బేల చూపుల మధ్య… ఏం చెయ్యాలో దిక్కుతోచక స్తంభించిపోయిన ఆ జీవితాలు ఎప్పటికి తేరుకుంటాయో అర్థంకాని పరిస్థితి నెలకొన్న దన్నారు.

ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాలు తమ శాయ శక్తులా ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నప్పటికీ… ఈ విపత్కర సమయంలో సహాయక చర్యలు మరింత వేగవంతం కావా లంటే…ఆ సిబ్బందికి తోడుగా మరికాస్త మానవవనరుల సహాయం అవసరమని విజయశాంతి తెలిపారు. అందుకే రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందికి తోడుగా అవసరమైన చోట్ల ఎన్‌సీసీ విద్యార్థుల సహకారాన్ని కూడా తీసుకుంటే వీలైనంత త్వరగా పరిస్థితులు చక్కబడతాయని ఆమె పేర్కొన్నారు. చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలని ఆ పరమాత్మను వేడుకుంటున్నాను అని విజయశాంతి ట్వీట్‌ చేశారు.

Exit mobile version