Site icon NTV Telugu

Indrakeeladri: నాలుగో రోజుకు చేరిన భవానీ దీక్షల విరమణలు

Untitled Design (1)

Untitled Design (1)

విజయవాడ ఇంద్రకీలాద్రిలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం కావడంతో భక్తుల రాక భారీగా ఉండనుందని దేవస్థాన అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు సుమారు 1,50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు.

అయితే.. ఆదివారం కావడంతో పాటు భవానీ దీక్షల విరమణల నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ రోజు ఉదయం 3:30 గంటల నుంచే అమ్మవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. భవానీ దీక్షల విరమణలు ఉండడంతో అంతరాలయ దర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. అలాగే అన్ని ఆర్జిత సేవలు, టికెట్ దర్శనాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. భవానీ దీక్షదారులకు ఐదు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా ఉచిత దర్శనానికి అనుమతి ఇచ్చారు. నిన్న మూడో రోజు మొత్తం 1,30,000 మంది భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. 60,000 లడ్డుల అమ్మకాలు జరగగా, 36,000 మంది అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే 10,813 మంది భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించారు.

భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసర ప్రాంతాల్లో 320 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. కొండ దిగువన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం మరియు అత్యవసర వైద్య సేవల కోసం మొత్తం 28 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Exit mobile version