NTV Telugu Site icon

కృష్ణ‌ప‌ట్నంకు ఆయుష్ టీమ్.. అన్నింటిపై ఆరా..!

Corona medicine

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను అడ్డుపెట్టుకుని అందిన‌కాడికి దండుకుంటున్నాయి ప్రైవేట్ ఆస్ప‌త్రులు, ఇక, ఫార్మా కంపెనీల దందా చెప్పాల్సిన ప‌నేలేదు.. ఈ త‌రుణంలో.. ఉచితంగా క‌రోనావైర‌స్‌కు ఆయుర్వేద మందు పంపిణీ చేస్తూ వార్త‌ల్లో నిలిచారు నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంకు చెందిన ఆనంద‌య్య‌.. ప‌దులు, వంద‌ల్లో వ‌చ్చేవారి సంఖ్య ఏకంగా వేల‌కు పెరిగిపోయింది.. దీంతో.. తాత్కాలికంగా మందు పంపిణీ నిలిపివేయాల్సిన ప‌రిస్థితి. మ‌రోవైపు.. ఆ మందులోని శాస్త్రీయ‌త‌ను తేల్చేప‌నిలోప‌డిపోయారు. ఆయుష్‌తో పాటు ఐసీఎంఆర్ కూడా రంగంలోకి దిగింది. కృష్ణపట్నంకు వెళ్లింది ఆయుష్ కమిషనర్ రాములు బృందం.. ఆనందయ్య తయారుచేసే వివిధ చెట్ల ఆకులు, పదార్థాలను ప‌రిశీలించింది.. మందు తయారీ విధానాన్నికూడా అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందులో ఏమేమి వస్తువులు కలుపుతున్నారు..? ఎలా? తయారు చేస్తున్నారు..? అనే విషయాలను దగ్గరుండి ప్రత్యక్షంగా ప‌రిశీలించారు.

ఇక‌, ఆయుర్వేద మందు వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వ‌చ్చాయా? లేదా? అనే విషయంపై ఐసీఎంఆర్ టీమ్ దృష్టి సారించింది.. ఆ మందు తీసుకున్న‌వారి దగ్గరికి వెళ్లి పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.. ఈ నివేదిక‌లు రెండు, మూడు రోజుల్లో వ‌స్తాయ‌ని చెబుతున్నారు. అయితే, ఆయుష్ టీం వ‌చ్చిన‌ప్పుడు ఆనంద‌య్య అందుబాటులో లేరు.. ఆయన వచ్చిన తర్వాత మళ్లీ ఒకసారి వచ్చి పరిశీలన చేస్తామ‌ని చెప్పారు.. మొత్తంగా ప‌రిశీలిస్తే.. ఇప్పటివరకు ఒక నెగెటివ్ మార్కు కూడా లేన‌ట్టుగా తెలుస్తోంది.. మ‌రి నివేదిక‌లు ఎలా వ‌స్తాయి..? ఆయుర్వేద మందు పంపిణీ కొన‌సాగుతుందా? ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తోన్న వేలాది మందికి మందు అందుతుందా? వేచిచూడాలి.