NTV Telugu Site icon

Andhra Pradesh: గుడ్‌న్యూస్‌ చెప్పిన సర్కార్‌.. భూ పంపిణీకి చకాచకా ఏర్పాట్లు

R5 Zone

R5 Zone

Andhra Pradesh: పేదలకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఆర్5 జోన్‌లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు అధికారులు.. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలోని పేదలకు 1402.58 ఎకరాలలో భూ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.. నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరం ప్రాంతాలలో లేఅవుట్లలో ఏర్పాటు జరుగుతున్నాయి.. 25 లేఅవుట్లలో అభివృద్ధి పనులు చేపట్టారు.. ఈ పంపిణీ ద్వారా 50,004 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది..

Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌ను పబ్లిక్‌లో ఉరితీయాలి.. ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు

మరోవైపు, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు అమరావతి ప్రాంత రైతులు.. కానీ, స్టే ఇవ్వడానికి నిరాకరించింది సర్వోన్నత న్యాయస్థానం.. పలు లేఅవుట్లలో జంగిల్ క్లియరెన్స్, సరిహద్దు రాళ్ళ ప్లాంటేషన్ పూర్తయ్యాయి.. లేఅవుట్ లోపల రోడ్లు వేసే ప్రక్రియ చకచకా సాగుతోంది.. 180 కిలో మీటర్ల మేర గ్రావెల్‌ తో రహదార్ల అభివృద్ధి జరుగుతోంది. అదనంగా కేటాయించిన 268 ఎకరాల్లోనూ జోరుగా లే అవుట్ పనులు జరుగుతున్నాయి.. ఇక, ఎస్ 3 జోన్ పరిధిలోని బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరం, పిచ్చుకల పాలెంలో అదనంగా భూ కేటాయింపులు చేశారు.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. అదనపు లేఅవుట్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.. అమరావతి రైతుల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుటుంది ప్రభుత్వం..

కాగా, రాజధాని అమరావతి ఆర్-5 జోన్‌లో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పనులను పూర్తి చేస్తోంది. ఆర్‌ 5 జోన్‌లో లేఅవుట్లు వేయడం, ప్లాటింగ్‌ చేసే పనులు జరుగుతున్నాయి. తాజాగా ఆ ప్రాంతంలో లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం ముహుర్తం ఖరారు చేసింది. ఈ నెల 18న ఆర్-5 జోన్‌లో పేదలకు భూములు పంపిణీ చేయనున్నారు.. సీఎం వైఎస్‌ జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్న విషయం విదితమే.