Site icon NTV Telugu

APSRTC: మరోసారి అద్దె బస్సుల‌ యజమానులతో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సమావేశం!

Apsrtc

Apsrtc

విజయవాడలో ఇవాళ మరోసారి అద్దె బస్సుల యజమానులతో ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు చర్చలు జరిగినప్పటికీ ప్రధాన డిమాండ్లపై ఎలాంటి తుది నిర్ణయం వెలువడకపోవడంతో.. ఈ సమావేశంపై అద్దె బస్సుల యజమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా MSTC–1, 2, 3, 4 టెండర్లలో పాల్గొన్న హైర్ బస్సుల యజమానుల డిమాండ్లే చర్చల కేంద్రబిందువుగా మారాయి. ‘స్త్రీశక్తి’ పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల బస్సులపై మెయింటెనెన్స్ భారం గణనీయంగా పెరిగిందని హైర్ బస్సుల ఓనర్లు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా నిబంధనల్లో మార్పులు అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు.

మైలేజీ అంశంలో కూడా ఇరువర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ 1.8 KMPL వరకు అంగీకరించేందుకు సిద్ధంగా ఉండగా, హైర్ బస్సుల యజమానులు కనీసం 2.5 KMPL కావాలని పట్టుబడుతున్నారు. అలాగే హైర్ బస్సుల డ్రైవర్లకు చెల్లించే జీతాలు కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల డ్రైవర్లకు సమానంగా ఉండాలని వారు కోరుతున్నారు. మూడు వేర్వేరు అసోసియేషన్‌లు ఉండటం వల్ల టెండర్ కాలంలో అనేక ఇబ్బందులు తలెత్తాయని యజమానులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఓవర్‌లోడ్ సమస్యపై స్పష్టమైన, నిర్దిష్ట నిర్ణయం తీసుకుంటేనే మిగతా అంశాలపై చర్చ కొనసాగిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. బస్సుల్లో ఎంతమందిని అనుమతించాలి, అలాగే నిర్దిష్ట స్టేజీలపై స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన లేఖను జారీ చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

Also Read: Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు!

పాయింట్ల వ్యవస్థలో మార్పులు చేయాలని కూడా హైర్ బస్సుల యజమానులు కోరుతున్నారు. ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసులకు 0.50 పాయింట్లు, సిటీ ఆర్డినరీ సర్వీసులకు 0.65 పాయింట్లుగా మార్చాలని సూచిస్తున్నారు. అలాగే ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ‘స్త్రీశక్తి’ కారణంగా ఓఆర్ (ఓవర్ రన్నింగ్) పెరిగి బస్సుల తరుగుదల కూడా ఎక్కువైందని యజమానులు వాపోతున్నారు. ఈ అన్ని అంశాలపై ఇవాళ జరిగే ఎండీ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం రాకపోతే మరోసారి సమ్మె బాట పట్టే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ఏపీఎస్ఆర్టీసీకి, అద్దె బస్సుల యజమానులకు కీలకంగా మారింది.

Exit mobile version