ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఒకేసారి 998 అద్దె బస్సులకు టెండర్లు పిలవడం పెను దుమారంగా మారింది. APSRTC ని ప్రైవేట్ వైపు తీసుకెళ్ళే ఆలోచనలో భాగంగానే అద్దె బస్సుల సంఖ్యని పెంచే ప్రయత్నంలో ఉన్నారని అనుమానాలు రేకెత్తాయి. అయితే, తాజాగా వీటిని APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు కొట్టిపారేశారు. అద్దె బస్సుల పెంపు వల్ల కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయే తప్ప, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందన్నది అవాస్తవమని స్పష్టం చేశారు.
Read Also: Rahul Gandhi OU Tour: రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరణ
కొన్ని పత్రికలు ఆర్టీసీపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆర్టీసీ సంస్థ, ఉద్యోగులతో పాటు ప్రజా ప్రయోజనాల సమన్వయంతో పని చేస్తోందని చెప్పారు. 1979 నుండి అద్దె బస్సులు నడుపుతున్నారని, ఇది కొత్తగా జరుగుతున్నది కాదని వెల్లడించారు. ప్రస్తుతానికి 598 అద్దె బస్సులు నడుపుతున్నామని తెలిపారు. కోవిడ్ కారణంగా ఆర్ధిక పరిస్థితి బాలేదని, కొత్తవి కొనలేక అద్దె బస్సులకు టెండర్లు పిలిచామన్నారు. ఇందులో భాగంగా తొలిసారి నాన్-ఏసీ స్లీపర్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పిన ఆయన.. అద్దె బస్సుల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల భద్రతకు ఎలాంటి భంగం కలగదన్నారు.
ప్రస్తుతం ఆర్టీసీలో 23 శాతం అద్దె బస్సులున్నాయని, కొత్త వాటిని తీసుకోవడం ద్వారా 32 శాతం అద్దె బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అయితే.. అద్దె బస్సుల నిర్వహణ, డ్రైవర్ జీతభత్యాలు అంతా బస్సు యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ రూ. 1,685 కోట్ల అప్పులు తీర్చామని, కారుణ్య నియామకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని, ఇందుకు సంబంధించిన జాబితాను సంబంధిత కలెక్టర్లకు కూడా పంపామని ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.