NTV Telugu Site icon

APNGO: ఏపీఎన్‌జీజీవోగా మారిన ఏపీఎన్‌జీవో .. గెజిటెడ్‌ ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు

Apngo

Apngo

APNGO: ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్ అసోసియేషన్‌(ఏపీఎన్‌జీవో)గా ఇన్ని రోజులు కొనసాగిన సంఘం కాస్త కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ నాన్‌గెజిటెడ్‌, గెజిటెడ్‌ ఆఫీసర్స్ అసోసియేషన్‌(ఏపీఎన్‌జీజీవో)గా మారనుంది. ఈ మేరకు ఏపీఎన్‌జీవో బైలాస్‌లో మార్పు చేసినట్టు ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు తెలిపారు. ఏపీఎన్‌జీవో రాష్ట్ర 21వ మహాసభలో విజయవాడ మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు రెండో రోజు మహాసభ కొనసాగుతుంది. మహాసభలో రాష్ట్రంలోని సుమారు 30వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. సోమవారం ప్రారంభమైన మహసభలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మహాసభలు ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం మహాసభల ముగింపు సందర్భంగా సంఘం నూతన కార్యవర్గాన్ని మహాసభ ఎన్నుకోనుంది. మహాసభల సందర్భంగా ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మంగళవారం మీడియాతో మాట్లాడారు.

Read also: Samsung 440 MP Camera: శాంసంగ్‌ నుంచి 440 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు.. ధర ఊహించడం కష్టమే!

ఏపీఎన్‌జీవో సంఘం బైలాలలో మార్పులు, చేర్పులు చేసినట్టు శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచి ఏపీఎన్‌జీవో సంఘం కాస్త ఏపీఎన్‌జీజీవోగా మారుతుందని స్పష్టం చేశారు. సంఘంలో మెంబర్‌షిప్‌ అధికంగా పెరగడంతో సంఘంలో పోస్టులను పెంచుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 5 పోస్టులను, జిల్లాల్లో 2, తాలూకాల్లో 2 పోస్టులను పెంచుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఏపీఎన్‌జీజీవో కాస్త 26 బ్రాంచీలుగా మారనుందన్నారు. అయితే ప్రభుత్వం తమ బైలాలో మార్పులను ఆమోదించాల్సి ఉంటుందని.. ప్రభుత్వం ఆమోదించిన తరువాత తాము చేసిన మార్పులు అమల్లోకి వస్తాయని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఏపీఎన్‌జీవో సంఘం నేత విద్యాసాగర్ మాట్లాడుతూ తమ ఎన్‌జీవో సంఘంలోని చాలా నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు గెజిటెడ్‌ అయిపోయాయని.. అందువల్ల గెజిటెడ్‌ను కూడా తమ సంఘంలో చేర్చి పేరు మార్చినట్టు తెలిపారు. ఇకపై ఏపీఎన్‌జీజీవోగా తమ సంఘం కొనసాగుతుందని విద్యాసాగర్‌ తెలిపారు. 26 జిల్లాల్లో 250 పోస్టులు మహిళలకు కేటాయించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.