రేపల్లె రైల్వే స్టేషన్ అత్యాచార ఘటన ఆంధ్రప్రదేశంలో ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలుసు! రాష్ట్రంలో మహిళా సంరక్షణపై ఆ ఘటన ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తించింది! రైల్వే స్టేషన్‌లాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్, అది కూడా భద్రత ఎక్కువగా ఉండే చోట్లలో ఒకటైన అలాంటి ప్రదేశంలో.. ఓ మహిళ అత్యాచారానికి గురవ్వడాన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read Also: Botsa Satyanarayana: నారా లోకేష్ లేఖకు బొత్స స్ట్రాంగ్ రియాక్షన్
ఈ నేపథ్యంలోనే మహిళా కమీషన్ రంగంలోకి దిగింది. రైల్వేస్టేషన్ ఆవరణలు, రైళ్లల్లో ప్రయాణించే మహిళల భద్రత – రక్షణకు సంబంధించిన చర్యలపై ఆయా శాఖలను వివరణ కోరింది. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం, గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఎస్పీలకు లేఖలు రాసింది. ఫ్లాట్ఫామ్‌లపై మహిళలకు ప్రత్యేకంగా వెయిటింగ్ రూమ్, లైటింగ్, సీసీ కెమెరాలు, వాష్ రూమ్ వంటి సౌకర్యాలపై రైల్వేశాఖ తీసుకున్న చర్యల్ని వివరించాలని కోరింది.
అటు, గుంతకల్లు డివిజన్‌కు కూడా రైల్వేశాఖ పోలీసు ఆధ్వర్యంలో సిబ్బంది కేటాయింపు, స్టేషను పరిధిలో గస్తీ, అనుమానితుల తనిఖీలు, ఫ్లాట్ ఫాంలపై ఫిర్యాదుల బాక్సుల ఏర్పాట్లకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరుతూ ఎస్పీకి లేఖ రాసింది. సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని లేఖలో పేర్కొంది. గురజాల రైల్వేహాల్ట్, రేపల్లె రైల్వే స్టేషన్‌లలో జరిగిన ఘటనల్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన కమిషన్.. ఇలాంటి ఘటనలపై కేంద్ర రైల్వేశాఖను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖలో కోరారు.
