నిత్యం వివాదాలతో సావాసం చేసే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేస్తామని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ద్రౌపది ముర్ము పై ఆర్జీవీ అనుచిత వాఖ్యలు చేయటం దురదృష్టకరమన్నారు. ఆర్జీవీ వెంటనే తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్జీవీ సినిమా రంగంలో పనిచేసే వ్యక్తి అని, ఆయన చేసే కామెంట్స్ సమాజంపై ఎంతో ప్రభావం చూపుతాయని వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం వస్తే కించపరిచేలా మాట్లాడటం తగదని హితవు పలికారు. మహిళలను గౌరవించాలని.. ప్రజల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు.
కాగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ రాంగోపాల్ వర్మ ఇటీవల ఓ ట్వీట్ చేశాడు. ‘ఒకవేళ ద్రౌపది ప్రెసిడెంట్ అయితే.. ఇక్కడ పాండవులు ఎవరు? ఇక ముఖ్యంగా కౌరవులు ఎవరు?’ అంటూ ప్రశ్నించాడు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్‌పై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మహిళను, రాష్ట్రపతి అభ్యర్థిని కించపర్చినట్లు మాట్లాడిన వర్మపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి వైసీపీ మద్దతు పలికిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరఫున మహిళా కమిషన్ కూడా ఆర్జీవీ వ్యాఖ్యలను తప్పుబట్టింది.