NTV Telugu Site icon

చెయ్యేరు బీభత్సం.. ఇంకా కానరాని 12 మంది ఆచూకీ..

భారీ వర్షాలు ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలతో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో చెయ్యేరు నదికి వరద పోటెత్తింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉన్న 12 గ్రామాలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలైతే ఇక్కడ ఊర్లు ఉండేవి అనేంతా కొట్టుకుపోయాయి. ఇళ్లు, వాకిలి, పశువులు కొట్టుకుపోవడంతో అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికీ వరద బీభత్సవానికి పలు గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. అయితే ఈ వరదల్లో 39 మంది గల్లంతు కాగ 29 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 12 మంది ఆచూకీ మాత్రం లభ్యకాకపోవడంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. వరద ప్రభావంతో ఇప్పటికే 433 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 579 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు 586 హెక్టార్లలోని పంటకు నష్టం వాటిల్లింది.