NTV Telugu Site icon

AP TET 2022 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. ఇదిగోండి లింక్

Ap Tet Results

Ap Tet Results

AP TET 2022 Results Released: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET-2022) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, PHC, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అర్హత పరీక్ష మార్కులను నార్మలైజేషన్ పద్ధతి అమలు చేశాక 58.07 శాతం మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 5,25,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 4,07,329 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలను ఆగస్టు 6వ తేదీ నుంచి 21వ తేదీ దాకా అధికారులు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 150 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. నిజానికి.. ముందుగా రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం, ఈ టెట్ ఫలితాలు సెప్టెంబర్ 14వ తేదీనే విడుదల కావాల్సింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు విడుదల చేయడం కుదరలేదు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను https://cse.ap.gov.in/DSE/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇదిలావుండగా.. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఖాళీగా ఉన్న 269 స్థానాల్ని భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో గ్రూప్-4 కింద 6 పోస్టులు, నాన్ గెజిటెడ్ విభాగంలో 45, ఆయుర్వేద లెక్చర్ల విభాగంలో 3, హోమియో లెక్చరర్ల విభాగంలో 34, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ విభాగంలో మరో 72, హోమియో మెడికల్ ఆఫీసర్ విభాగంలో 53, యునాని మెడికల్ ఆఫీసర్ విభాగంలో 26, ఏఈఈ విభాగంలో 23, సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో 7 ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టులకు తగినట్లు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. ఏపీ ఆర్‌జేయూకేటీ (RJUKT) ప్రవేశ పరీక్ష ఫలితాలను కూడా గురువారం విడుదల చేశారు. మొత్తం 44,208 మంది దరఖాస్తు చేసుకోగా.. 66 శాతం మంది అమ్మాయిలు, 23 శాతం అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. జల్లెల నందిని మయూరీ అనే అమ్మాయి ఈ ఫలితాల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచింది.