Site icon NTV Telugu

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌పై తెలంగాణ సంచలన నిర్ణయం.. ఇలా స్పందించిన మంత్రి అమర్నాథ్‌

Vizag Steel Plant

Vizag Steel Plant

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమంటూ ఇప్పటికే ప్రకటించింది బీఆర్ఎస్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు.. ఇక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననున్నట్టు తెలుస్తోంది.. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారట.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు ఓ వైపు ఉద్యమాలు చేస్తుండగానే కేంద్రం మాత్రం దానిని విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బిడ్డింగులో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.. ఫ్యాక్టరీ నిర్వహణ కోసం మూలధనం/ ముడిసరుకుల కోసం నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదనల బిడ్డింగులో సింగరేణి లేదంటే రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ లేదంటే నీటిపారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.. అయితే, ఈ ప్రచారంపై స్పందించిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.. దానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉందన్నారు.

Read Also: Mass Copying: ఇంటర్ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దు అనేదే మా స్టాండ్‌ అని స్పష్టం చేశారు.. మా స్టాండ్ అదయినప్పుడు మేం కొంటామా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ వాళ్లు కొoటే మీ స్టాండ్ ఏంటి? అనే ప్రశ్నేలేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిoచటానికి వీలు లేదు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనే వ్యక్తి చెప్పారన్నప్పుడు.. మళ్లీ వాళ్లే కొంటాం అనడమెందుకు? అని నిలదీశారు. అంటే స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేయమనేనా వారి ఉద్దేశమా? అని ప్రశ్నించారు. అయినా. స్టీల్ ప్లాంట్ పై మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్స్ తప్ప ఇంతవరకు కేసీఆర్‌ నుంచి గానీ.. తెలంగాణ ప్రభుత్వం నుండి గానీ అధికారిక ప్రకటన వినలేదన్నారు. వాళ్ల స్టాండ్ ఏంటో క్లారిటీ రావాలి.. వాళ్ల స్టాండ్ ఏంటో తెలియకుండా నేను ఏమీ మాట్లాడలేను అన్నారు. రాజకీయాల కోసం వాళ్లు ఏవేవో మాట్లాడుతారు… వాళ్ల రాజకీయ విమర్శలకో.. ఇంకోదానికో.. మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఏదేమైనా స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్‌గా స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.

Exit mobile version