విశాఖ లోని అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో ఎస్ఈజెడ్‌లోని ప్రమాద ప్రాంతాన్ని మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతి శనివారం పరిశీలించారు. గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి 9 గంటల వరకు అన్ని డిపార్ట్మెంట్ లతో రివ్యూ నిర్వహించడం జరిగింది. అధికారులు, ఎక్స్ పర్ట్స్ అభిప్రాయాలు తీసుకోవాలని కోరామన్నారు మంత్రి అమర్ నాథ్. అసలు ఎక్కడ నుండి గ్యాస్ లీక్ అయిందో తెలీదు. ఏసీ నుండి వచ్చిందా, ఇంకెక్కడ నుండైనా లీక్ అయింద అనేది తెలియాల్సి ఉంది.
సోమవారం నాటికీ ఒక ప్రిలిమినరి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. పోరస్ మీద ముందు అనుమానం వచ్చింది కానీ ఏసీ వల్ల ఎలాంటి వాయువులు లీక్ అయ్యాయో చూడాలి. ఆంధ్రా యూనివర్సిటీ నిపుణుల సహాయంతో నివేదిక వచ్చే అవకాశం ఉందన్నారు. గ్యాస్ లీకేజీకి కారణాలు ఏవైనా ముందుగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే మా ఉద్దేశం అన్నారు మంత్రి.
మరోవైపు గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులు క్రమేపీ కోలుకుంటున్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులు డిశ్చార్జి అవుతున్నారు. శనివారం ఉదయం ఎలమంచిలి ఆసుపత్రి నుంచి కోలుకున్న బాధితులు ఇళ్లకు వెళ్లిపోయారు. మరికొన్ని ఆసుపత్రుల్లో కొందరు బాధితులు ఇంకా చికిత్స పొందుతున్నారు. వారికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి డిశ్చార్జి చేయనున్నారు. 124 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
