H3N2 influenza: ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ టెన్షన్ పెడుతోంది.. ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్ ఎవ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కీలక సూచనలు చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా H3N2 వైరస్ పై అవగాహన కల్పిస్తున్నామన్న ఆయన.. ఈ వైరస్ గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో గతంలో వచ్చి పోయినట్టు తెలిపారు.. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖలో ఎక్కువగా కన్పిస్తోందన్నారు.. ముక్కు నుంచి గొంతు వరకు దీని ప్రభావం ఉంటుందని వెల్లడించారు.. గత కొన్నేళ్లుగా ఈ వైరస్ మ్యూటేషన్ అవుతూ వస్తోంది. మొదటి మూడు, అయిదు రోజులు దగ్గర, జ్వరం వస్తుంది.. చిన్నారులు, వృద్దులకి ఈ వైరస్ వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని తెలిపారు.
Read Also: IND VS AUS: తొలి రోజు ఆసీస్ దూకుడు.. సెంచరీతో చెలరేగిన ఖవాజా
జనవరిలో 12 కేసులు, ఫిబ్రవరిలో 9 కేసులు నమోదైనట్టు తెలిపారు డాక్టర్ వినోద్ కుమార్.. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.. ఈ వైరస్ సోకితే విద్యార్థులని స్కూళ్లకి పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఇక, ఈ వైరస్ పై అనవసర అపోహలు వద్దు.. బయట నుంచి ఇంటికి రాగానే చేతులు తప్పనిసరిగా కడగడం మర్చిపోవద్దన్నారు.. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆయన.. ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం ఈ వైరస్ ద్వారా వచ్చినదిగానే భావించాలని వ్యాఖ్యానించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ ద్వారా ఇన్ఫూయీంజా వ్యాపిస్తోందని.. వైద్యుల సలహాల మేరకే యాంటిబయాటిక్స్ వాడాలన్నారు ఏపీ మెడికల్ ఎవ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.
కాగా, రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్, వడదెబ్బలపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ఈ అంశాలపై జూమ్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం విదితమే.. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఉన్నతాధికారులు, 26 జిల్లాల DM&HOలు, 16 GGHల సూపరింటెండెంట్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఇన్ఫ్లుయంజా వైరస్, వడదెబ్బపై కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రంలో అప్రమత్తంగా ఉన్నామని కృష్ణబాబు స్పష్టం చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామన్న ఆయన.. ఏర్పాట్లపై డిఎంహెచ్ఓలకు పలు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే వారం రోజులపాటు ఫీవర్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. వడదెబ్బకు గురికాకుండా ప్రజల్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వీలైతే స్వచ్ఛంద సేవా సంస్థల్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలు బయట తిరగకుండా ఉండేలా అలర్ట్ చేయాలని కృష్ణబాబు తెలిపారు. ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని, జిల్లా కలెక్టర్లతో డిఎంహెచ్ఓలు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఎన్జీవోలతో కలెక్టర్లు సమావేశాన్ని ఏర్పాటు చేసేలా డిఎంహెచ్‌ఓలు చొరవ తీసుకోవాలన్నారు. శీతల నీటి కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు విలేజ్ క్లినిక్‌ల స్థాయిలో సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్ఆర్‌జీయస్ క్యాంపుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించే విషయంలో ఎమ్ఎల్‌హెచ్‌పీలకు తగిన శిక్షణ ఇవ్వాలని.. ఎంఎల్‌హెచ్‌పీలు , ఎఎన్ఎంలు సమన్వంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.